Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. ఎస్.దర్శన్ దర్శకత్వంలో అలనాటి మేటినటి భానుమతి రామకష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈనెల 27న సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.దర్శన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, 'మా నాన్నగారు కేశన్ తమిళంలో రైటర్, డైరెక్టర్. 'యమగోల మళ్లీ మొదలైంది' సినిమాకు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డిగారి దగ్గర నాన్న వర్క్ చేశారు. అప్పుడు నేను యానిమేటర్‌గా వర్క్ చేస్తున్నాను. అయితే నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. నాన్న రికమండేషన్‌తో 'ఢమరుకం' చిత్రానికి శ్రీనివాసరెడ్డిగారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆయన దగ్గర నేర్చుకున్న ప్రతీ విషయం ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది. 2010లో ఓ రోజు నాకు, నా స్నేహితుడికి చెన్నైలో జరిగిన వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని ఓ కథ ప్రిపేర్ చేశా. కథానాయకుడు సూర్య తన 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్వహించిన టాలెంట్ హంట్‌లో నా స్క్రిప్ట్ సెలెక్ట్ అయ్యింది. దీంతో నాకొక గుర్తింపు లభించింది. అలాగే నా స్నేహితులు ప్రియదర్శన్, అభినవ్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడ దర్శకుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టా. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సినిమా చేశా. ఇది కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ అంశాలూ ఉంటాయి. నో పార్కింగ్‌లో బండి పెట్టడం వల్ల ఏం జరిగిందనేదే కథ. ఇది ఒక రోజులో జరిగే కథ. ఇందులో సుశాంత్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా, అర్కిటెక్చర్గా కనిపిస్తారు. స్నేహానికి విలువ ఇస్తూ, బాధ్యతగా మెలిగే అబ్బాయి. తనకి ఎదురైన సమస్యను ఎలా ఫేస్ చేశాడనేదే ఈ సినిమా. నేను కావాలనుకున్న డిఫరెంట్ జోనర్ సాంగ్స్‌ను సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు చక్కగా కంపోజ్ చేసిచ్చారు. నిర్మాతలు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ సినిమాకి ఏం కావాలో, ఏదిస్తే బెటర్ అవుతుందో దాన్ని అడిగి మరీ ఇచ్చారు. కోవిడ్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది. అయితే ఈ మధ్యలో చాలా మంది మమ్మల్ని ఓటీటీకి వెళ్లమని చెప్పారు. కానీ నిర్మాతలు ఒప్పుకోలేదు. థియేటర్స్‌లోనే సినిమాని విడుదల చేస్తామని చెప్పారు' అని తెలిపారు.