Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటికే 'ఆచార్య'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరంజీవి ఇకపై 'గాడ్‌ఫాదర్'గా, 'భోళా శంకర్'గానూ అలరించడానికి రెడీ అవుతున్నారు. ఆదివారం చిరంజీవి బర్త్‌డే సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలతోపాటు క్రీడారంగం, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చిరు అభిమానులు సైతం బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అన్నయ్య చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని తాను ఎదిగిన వైనాన్ని, మెగాస్టార్ గొప్పతనాన్ని పవన్‌కళ్యాణ్ భావోద్వేగభరితంగా అక్షరబద్ధం చేస్తే, చిరు తనయుడు రామ్‌చరణ్, 'ఆచార్య' షూటింగ్ సమయంలో తన తండ్రితో గడిపిన మధుర క్షణాల్ని, నటనలో ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్న మెళకువల్ని ఓ వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో వేలాది మంది చిరంజీవి అభిమానులతోపాటు సామాన్యులు సైతం రక్తదానం చేశారు. ఇదంతా ఓ ఎత్తయితే, చిరు బర్త్‌డే సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఆయన నటిస్తున్న మూడు కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో సోషల్ మీడియా షేకైంది.
చిరంజీవి 154వ చిత్రం బాబీ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ విషయాన్ని శనివారం మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. అలాగే ఆదివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు విషెష్ తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు ఈ చిత్రానికి సంబంధించి మరో పోస్టర్‌ను విడుదల చేశారు.
సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ చెప్పకనే చెబుతోంది. ఇందులో చిరంజీవి మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తుంటే చిరంజీవి 'ముఠామేస్త్రీ', 'ఘరానా మొగుడు', 'రౌడీ అల్లుడు' చిత్రాల్లోని వింటేజ్ లుక్ గుర్తుకు రావడం ఖాయం. పోస్టర్ని, అందులోని చిరంజీవి ఊరమాస్ లుక్‌ని రిప్రజెంట్ చేస్తూ 'పూనకాలు లోడ్ అవుతున్నాయి..' అనే పోస్టర్లో పేర్కొన్న క్యాప్షన్‌తో సర్వత్రా అంచనాలు పెరిగాయి.
దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మాతలు. జి.కె.మోహన్ కో ప్రొడ్యూసర్.