Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. ఎస్.దర్శన్ దర్శకత్వంలో అలనాటి మేటినటి భానుమతి రామకష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు నాగార్జున ట్విట్టర్ వేదికగా విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో నిర్మాత రవి శంకర్ శాస్త్రి మాట్లాడుతూ, 'ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. రియల్ ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకుని తెరకెక్కించారు. ఈ నెల 27 నా పుట్టినరోజున మా సినిమా విడుదల కావడం డబుల్ ధమాకాగా భావిస్తున్నాను' అన్నారు. మరో నిర్మాత హరీష్ కోయిలగుండ్ల మాట్లాడుతూ, 'నిర్మాత రవిశంకర్ శాస్త్రి మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని చెప్పారు. సుశాంత్ కారణంగానే నేను నిర్మాతనయ్యా. ఇందులో కొత్త సుశాంత్‌ను చూస్తారు' అని చెప్పారు. డైరెక్టర్ ఎస్.దర్శన్ మాట్లాడుతూ, '2010లో నేను, నా స్నేహితుడు ఫేస్ చేసిన నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాం' అని తెలిపారు. 'దర్శన్ చెప్పిన కథ రియలిస్టిక్‌గా, గ్రిప్పింగ్ ఉండటంతో ఈ సినిమాని వదులుకోకూడదు అనిపించింది. మంచి ఇన్టెన్స్ ఉంది. కొత్తదనమూ ఉంది. రొటీన్‌కు భిన్నమైన సినిమా అని కచ్చితంగా చెప్పగలను' అని హీరో సుశాంత్ తెలిపారు.