Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్
చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులను కించపరిచేలా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ ఆఫీసర్ బేరర్స్ సమక్షంలో, పలువురు చేసిన వ్యాఖ్యలను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది.
నాని నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో ఇటీవల తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ మీడియా సమావేశాన్ని నిర్వహించి, హీరో నానితోపాటు నిర్మాతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
'అసలు ఫస్ట్.. సినిమా నిర్మాణాన్ని ప్రారంభించేది నిర్మాతే. నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి సినిమాకి పునాది వేసేది నిర్మాతే. ఏ నిర్మాత అయినా సరే, తన సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తారు. గతంలో శాటిలైట్, ఇప్పుడు పలు ఓటీటీ మాధ్యమాల ద్వారా నిర్మాత తన పెట్టుబడిని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేయాలనే నిర్ణయం తీసుకునే హక్కు నిర్మాతది. ఓటీటీ మాధ్యమంలో తమ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో, నిర్మాతను సభాముఖంగా విమర్శించడం, వ్యక్తిగతంగా బెదిరించడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం అనిపించుకోదు. ప్రత్యేకంగా ఒక హీరోను ఎవరైనా టార్గెట్ చేయడం ద్వారా పరిశ్రమలోని ఆరోగ్యకర, స్నేహపూర్వక సంబంధాలను దెబ్బ తీస్తుంది. పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంలో నిర్మాతలకు సహాయపడమని చాలా వేదికల్లో ఎగ్జిబిటర్లకు మేం విజ్ఞప్తి చేశాం. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం కేవలం విపరీతమైన డిమాండ్ ఉన్న సినిమాలపై ఆసక్తి చూపిస్తూ, చిన్న, ఓ మాదిరి చిత్రాలను అస్సలు పట్టించుకోవడం లేదు. వాటిని పూర్తిగా విస్మరిస్తున్నారు. దీంతో చాలా చిత్రాలు గత్యంతరం లేక భిన్న మార్గాల ద్వారా పెట్టుబడిని రాబట్టుకునే పనిలో సతమతమవుతున్నాయి.
నిర్మాతల మనుగడను ఏ రంగమూ నిర్దేశించకూడదు. అలాగే ఎవ్వరికీ బెదిరించే అధికారం లేదు. పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు పరస్పరం ఒకరిపై మరొకరు ఆధారపడిన పరిశ్రమ మనది. వ్యక్తిగతంగా, వ్యవస్థాగతంగా మనమంతా కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అన్ని సెక్టార్లూ కష్టకాలంలో ఉన్నాయని మేం అర్థం చేసుకున్నాం. వారితో పాటు మేమూ బాధ పడుతున్నాం. పరస్పన మద్దతు ఆశిస్తున్నాం. గతంలో ఎదుర్కొన్న సమస్యలకు అందరం కలసికట్టుగా పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన సమయం వచ్చిందని మేం భావిస్తున్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివద్ధి కోసం మనమంతా సమష్టిగా పని చేయాల్సిన తరుణమిది' అని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తెలిపింది.