Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'24 క్రాఫ్టుల సినీ కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మించి ఇస్తానని చిరంజీవి మాటిచ్చారు' అని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో శ్రీకాంత్తో బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ, 'రక్తదానం అంటే ప్రాణదానం చేయడమే. రక్తం సకాలంలో అందక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా రక్తదానం కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం కలిసినప్పుడు చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మిస్తానని చిరంజీవి మాటిచ్చారు. చిత్ర పరిశ్రమకు దాసరి గారు లేని లోటు చిరంజీవి తీరుస్తున్నారు' అని చెప్పారు.
'సినీ కార్మికుల బాగు కోసం చిరంజీవి ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. సీసీసీ ద్వారా కరోనా కష్టకాలంలోనూ ఆదుకున్నారు. ఇప్పుడు చిత్రపురిలో ఆస్పత్రి నిర్మాణం చేయబోతున్నారు. ఆయన ఎంత పెద్ద స్టారో, అంతే పెద్ద మనసున్న మనిషి' అని చిత్రపురి హౌసింగ్ సొసైటీ కార్యదర్శి కాదంబరి కిరణ్ చెప్పారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, 'సినీ కార్మికులంతా మన ఫ్యామిలీ. చిరంజీవి మంచి మనసు గురించి మనందరికీ తెలుసు. చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మిస్తానని మెగాస్టార్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.