Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, దర్శకత్వం వహించిన చిత్రం 'ది కిల్లర్'. శ్రీమతి లలిత సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్, సంకినేని వాసుదేవ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. డాలీషా, నేహా దేశ్‌పాండే కథానాయికలు. సెప్టెంబర్ 3న ఈ సినిమా విడుదల అవుతున్న సందర్బంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం వైభవంగా జరిపింది. ఈ వేడుకలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్రైలర్‌ని విడుదల చేయగా, బిగ్ టికెట్‌ని హీరో సోహెల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వాసుదేవరావు మాట్లాడుతూ, 'కార్తీ ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుని కథ, మాటలు, డైరెక్షన్, హీరో.. ఇలా అన్ని విధాలుగా చాలా కష్టపడి చేశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.
'ఈ సినిమా విషయంలో నమ్మకం కలిగి, మా అబ్బాయి కార్తీని ప్రోత్సహించాను. అనుకున్నట్టుగానే తానేమిటో ఈ సినిమా ద్వారా చూపించాడు. సెప్టెంబర్ 3న విడుదలయ్యే మా సినిమాతో బాక్సాఫీస్ బద్దలైపోతుంది' అని నిర్మాత రాజు యాదవ్ చెప్పారు.
హీరో, దర్శకుడు కార్తీక్ సాయి (చిన్నా) మాట్లాడుతూ, 'కిల్లర్ అంటే ఏదో థ్రిల్లర్ అనుకోకండి. ఇది ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. చిన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టారు. ఇందులో చాలా మంది కొత్తవాళ్లు నటించారు. ఇది నా పదేళ్ల కష్టం, ఇది గుర్తిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమా విడుదల రోజు మార్నింగ్ షో అన్ని సెంటర్స్‌లో ఉచితం. సినిమా చూసి బాగుంటే, పదిమందికి చెప్పండి' అని చెప్పారు.