Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్శకుడు త్రివిక్రమ్
సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. ఎస్.దర్శన్ దర్శకత్వంలో ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. అలనాటి మేటి నటి భానుమతి రామకష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మాతలు. ఈనెల 27న ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా మంగళవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, 'ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో థియేటర్‌కు రావడానికి సాహసిస్తున్న జాతి, తెలుగు జాతి మాత్రమే. ఏమీ భయపడక్కర్లేదు. మంచి కంటెంట్ క్రియేట్ చేసి, మరింత ముందుకు వెళ్దాం. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని విన్నాను. సుశాంత్ 'చి.ల.సౌ' సినిమాతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడ్డాడు. ఆ సినిమా చూసే నా 'అల వైకుంఠపురములో' యాక్ట్ చేయమని అడిగాను. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ బాగా నచ్చింది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.
'నేను తొలి మూడు, నాలుగు సినిమాలను లెక్కలు వేసుకుని చేశాను. అయితే అంత క్లారిటీ లేకపోయింది. 'చి.ల.సౌ' టైమ్‌లో నాగార్జున మామయ్య పిలిచి సినిమా ఆడినా, ఆడకపోయినా సొంతగా ఆలోచించమని సలహా ఇచ్చారు. అక్కడ నుంచి కొత్త మూమెంట్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకు నిర్మాతలు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. పెద్ద స్టార్‌ను కాదు, కొత్త హీరోయిన్, డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ, మాపై నమ్మకంతో ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడుతూ, సినిమా చేశారు. ఓటీటీ ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ నిర్మాతలు థియేటర్స్‌లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. నిజ ఘటనల ఆధారంగా చేసిన సినిమా ఇది. కాన్సెప్ట్ బేస్డ్, కానీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నా పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. కొత్త సుశాంత్‌ను చూపించబోతున్న దర్శన్‌కు థ్యాంక్స్' అని హీరో సుశాంత్ అన్నారు.
నిర్మాత రవి శంకర్ శాస్త్రి మాట్లాడుతూ, 'పెద్దమ్మమ్మ భానుమతిగారితో ఉండే అనుబంధం కారణంగా నాకు చిన్నప్పుడు సినీ పరిశ్రమతో పరిచయం ఏర్పడింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇండిస్టీలోకి అడుగుపెట్టాను. సుశాంత్ అందగాడే కాదు, తెలివైనవాడు, బాగా కష్టపడతాడు. తన ఎఫర్ట్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఈనెల 27న విడుదలవుతున్న మా సినిమాని ప్రేక్షకులు సక్సెస్ చేయాలి' అని చెప్పారు.
నిర్మాత ఏక్తా శాస్త్రి మాట్లాడుతూ, ''త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్. సుశాంత్, దర్శన్, మీనాక్షి సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు' అని అన్నారు. దర్శకుడు ఎస్.దర్శన్ మాట్లాడుతూ, 'ఎన్నో ఏళ్ల కల నేరవేరిన రోజుది. నాకు అండగా నిలబడిన కుటుంబ సభ్యులకు థ్యాంక్స్. 2010లో నాకు, నా స్నేహితుడికి ఎదురైన ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశాను. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరూ పనిని ప్రేమించి చేయడంతో సినిమా అద్భుతంగా వచ్చింది. థ్రిల్లర్ జోనర్లోని ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి. సినిమా కచ్చితంగా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది' అని తెలిపారు. మరో నిర్మాత హరీష్ మాట్లాడుతూ, 'రవి, ఏక్తాగారు.. సినిమా రేంజ్‌ను పెంచారు. కొత్తవాళ్లను నమ్మి మాకు సపోర్ట్ చేశారు. రవి, ఏక్తా, సుశాంత్.. వంటి వారితో ఈ సినిమా చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ సినిమాలో కొత్త సుశాంత్‌ను చూస్తారు. తనలో చాలా ఫైర్ ఉంది. ఈ సినిమా తర్వాత తనకు చాలా సినిమాలొస్తాయి' అని తెలిపారు.