Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాత్విక్ వర్మ, నేహా పఠాన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'బ్యాచ్'. శివ దర్శకత్వంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్నారు. బేబీ ఆరాధ్య సమర్పణలో, ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ను పూరి ఆకాష్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. రఘు కుంచె సంగీతం చాలా హైలైట్‌గా ఉంది. పాటలు చాలా బాగున్నాయి. సాత్విక్ చైల్డ్ యాక్టర్‌గా నటించిన చాలా సినిమాలు చూశాం. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించి, సాత్విక్ హీరోగా మరిన్ని చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నా' అని తెలిపారు. 'దర్శకుడు శివ చెప్పిన కథ నచ్చింది. మా చిత్రానికి సంగీతమే బలం. అన్ని పాటలూ అద్భుతంగా వచ్చాయి' అని నిర్మాత తెలిపారు. దర్శకుడు శివ మాట్లాడుతూ, 'కాకినాడలో నలుగురి స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశా. నిర్మాత రమేష్ ఒక పునాదిగా నిలిచారు. సినిమా బాగా వచ్చింది' అని అన్నారు. 'రఘు గారి సంగీతం మా సినిమాకి ప్రాణం పోసింది. అందరికీ బాగా నచ్చే సినిమా ఇది' అని హీరో సాత్విక్ వర్మ చెప్పారు. సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ, 'అసిరయ్య బాబారు, నిజామాబాద్ దగ్గర ఒక పల్లెటూరులో పెరిగిన లక్ష్మితో, అలాగే అమ్మాయి గొంతులా పాడే సాయి సంవిద్తో ఒక మంచి మెలోడీ సాంగ్ పాడించాను. గాయకులుగా పరిచయం అవుతున్న ఈ ముగ్గురి పాటలు మంచి హిట్ అవుతాయి' అని తెలిపారు. సత్తి బాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది ఈ చిత్రానికి సహనిర్మాతలు.