Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొంత కాలంగా తమ అభిమాన నటుడు ప్రభాస్ సినిమాలకు సంబంధించి అప్డేట్ల కోసం వేచి చూస్తున్న అభిమానులను 'రాధేశ్యామ్' చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్‌తో సర్ప్రైజ్ చేసింది. శ్రీ కృష్ణ జన్మాష్టమి పండగని పురస్కరించుకుని విడుదలైన లేటెస్ట్ పోస్టర్ అందర్నీ ఫిదా చేస్తోంది.
'ఆహ్లాదకరమైన వాతావరణంలో నవ్వులు చిందుస్తున్న ప్రేమికుల జంట ప్రభాస్, పూజా హెగ్డే చూడ ముచ్చటగా ఉన్నారు. నెమలి ఈకలతో రూపొందించిన పూజా క్యాస్ట్యూమ్ పోస్టర్‌కి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పోస్టర్ చాలా బాగుందంటూ అటు ప్రభాస్ అభిమానులు, ఇటు ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు ప్రశంసిస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్'. 1970 బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినూత్న ప్రేమకథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటలీ, జార్జియా, హైదరాబాద్‌ల్లో షూటింగ్ జరిగింది. ఇందులో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే ఇప్పటివరకు కనిపించని పాత్రల్లో మెరవబోతున్నారు. కథాపరంగా ఇందులోని విజువల్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయి' అని చిత్ర బృందం తెలిపింది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ, 'ప్రభాస్‌తోపాటు యూనిట్ అందరం ఎంతో ఇష్టపడి ఈ చిత్రాన్ని చేశాం. థియేటర్ల ద్వారా ఓ మంచి సినిమా చూశాం అనే అనుభూతికి ప్రేక్షకులు తప్పకుండా లోనవుతారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 14న చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు' అని చెప్పారు. భిన్న భాషల్లో రూపొందుతున్న ఈచిత్రాన్ని డా. యు.వి.కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై సమర్పిస్తుండగా, యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మాతలు.