Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటించిన చిత్రం 'టక్ జగదీష్'. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. ఈ చిత్రం ఈనెల 10న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ వేడుకలో హీరో నాని మాట్లాడుతూ, 'ఇప్పటికే చాలా మందికి ట్రైలర్ చూపించాం. అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. అదే దర్శకుడు శివ నిర్వాణ బలం. తెలుగు తెరపై అన్నదమ్ముల మధ్య వచ్చే గొడవలు, రిలేషన్స్ హ్యాండిల్ చేసి చాలా రోజులైంది. చిన్నతనంలో మనం చూసిన సినిమాలెన్నో ఉన్నాయి. కానీ గత కొన్నేళ్లుగా వాటిని మనం చూడలేదు. ఇదేమీ కొత్త సినిమా కాదు. ట్విస్ట్‌లు, కాన్సెప్ట్‌లు ఉండవు. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సినిమానే. మళ్లీ మన పాత రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉంటుంది. ఏదైనా సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది.. కానీ మన ఇంట్లో మాత్రం అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. 'టక్ జగదీష్' కూడా మన ఇంటి సినిమా. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. థియేటర్లో కాకుండా ఓటీటీలో సినిమాని విడుదల చేయడంపై కొంత మంది కొన్ని రకాల కామెంట్లు చేశారు. వారంతా నాకంటే పెద్దవాళ్లు. వారున్న పరిస్థితుల్లో అలా మాట్లాడటంలో తప్పు లేదు. ఆ కాసేపు వాళ్ళు నన్ను బయటి వాడిలా చేసేశారు. అదే నాకు బాధ. నేను వారి బాధను అర్థం చేసుకుంటాను. మంచి సినిమాను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడం లేదనే సమస్యే ఉండదు. ఒక్కో సినిమా ఒక్కో లెక్క ఉంటుంది.. అన్ని కోణాల్లో సినిమా గురించి ఆలోచించాలి. నిర్మాత, దర్శకులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమిది. థియేటర్లో అందరితో కలిసి చూడాలని నేనూ ఎంతో అనుకున్నాను. కానీ బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నాం. బయటి పరిస్థితులు త్వరగా చక్కబడాలి. మళ్లీ ఆ పూర్వ వైభవం రావాలి' అని అన్నారు.