Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి కాంబినేషన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు త్రివిక్రమ్ అందిస్తుండగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. గురువారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈచిత్రంలోని తొలిపాటను దర్శకుడు క్రిష్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఈ పాటను రాసిన గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, 'త్రివిక్రమ్ గారితో నాది ప్రత్యేకమైన అనుబంధం. స్వయానా ఆయన రచయిత దర్శకుడు అవడం గీత రచయితకు కొండంత బలం. ఆయన ద్వారానే 'జల్సా'లో మొదటిగా పవర్‌స్టార్‌కి పాట రాయడం జరిగింది. తదుపరి ఆయనకు ఎన్నో పాటలు రాసినా...ఈ టైటిల్ సాంగ్ రాయడం మాత్రం చాలా ప్రత్యేకం. నాకిష్టమైన ఇద్దరితో పని చేయడమే కాదు, వారి సమక్షంలో నేను రాసిన పాట వినిపించడం మరింత ఆనందం ఇచ్చింది. పాట వింటున్న వారి స్పందనను కళ్ళారా ఆస్వాదించడం మరపురాని అనుభూతి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మంచి చదువరి, సాహితీ పిపాసి. ఈ పాట అక్షరాక్షరం ఆయనకు నచ్చడం, నన్ను నేను మెచ్చుకునే విషయం. దీనికి కారణమైన త్రివిక్రమ్, సాగర్ చంద్ర, తమన్‌కు ధన్యవాదాలు. భీమ్లా నాయక్ దమ్ము... ధైర్యానికి అక్షరరూపంలా నిలుస్తుందీ గీతం. ఈ గీతంలోని ప్రతి పదం- తప్పు చేసే వాళ్లకు భీమ్లా ఓ సింహ స్వప్నం అని చెబుతుంది. భీమ్లా వ్యక్తిత్వం... డ్యూటీలో నిబద్ధత... తెగువను వెల్లడిస్తుంది' అని తెలిపారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని, 2022 జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.