Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నట్టికుమార్ తనయ నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'డిఎస్‌జె' (దెయ్యంతో సహ జీవనం). నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టి లక్ష్మి, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి క్రాంతి నిర్మించిన ఈ చిత్రం ఇదే నెలలో విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆదివారం ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు నట్టికుమార్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ, 'హర్రర్, సస్పెన్స్ అంశాల సమాహారంగా లేడీ ఓరియెంటెడ్‌గా సాగే చిత్రమిది. హీరోయిన్గా పరిచయం అవుతూ తొలి సినిమాలోనే నటించడానికి అవకాశం ఉన్న రెండు విభిన్న కోణాలు కలిగిన పాత్ర లభించడం ఆనందంగా ఉంది. నా పాత్రకు చక్కటి న్యాయం చేశానని యూనిట్ అభినందించింది. ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఈ చిత్రం ఉంటుంది' అని తెలిపారు. దర్శకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ, 'నా కూతురు నట్టి కరుణ ఈ చిత్రంలో అద్భుతంగా నటించింది. మా అంచనాలను ఈ చిత్రం నిలబెడుతుంది. ఒక యదార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే దాన్ని చాలా వినూత్నంగా చూపిస్తున్నాం. వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సుపర్ణ మలాకర్ ఇందులో సెకెండ్ హీరోయిన్గా ఓ పవర్ఫుల్ కాల్ గర్ల్ పాత్రలో నటించింది. ఈనెలలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. మరో హీరోయిన్ సుపుర్ణ మలాకర్ మాట్లాడుతూ, 'రెండు కోణాలు కలిగిన పాత్ర ఇందులో లభించింది. నా కెరీర్ మలుపుకు ఈ చిత్రం ఎంతగానో దోహదం చేస్తుంది' అని అన్నారు.ఎడిటర్ గౌతం రాజు, స్టంట్ మాస్టర్ విన్ చన్ అంజి, నటులు హరీష్ చంద్ర, తేజ, శ్రావణ్, గీత రచయిత రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.