Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా కెరీర్లో ఇప్పటివరకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న సినిమా చేయలేదు. అలాగే మహిళల కబడ్డీతో ఇంతవరకు తెలుగులో సినిమా రాలేదు. అందుకే 'సీటీమార్' సినిమాకి గ్రీన్‌సిగల్ ఇచ్చా' అని చెబుతున్నారు హీరో గోపీచంద్. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీటీమార్'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. వినాయక చవితి కానుకగా ఈనెల 10న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా లేదు. అలాగే కథలో భాగంగా వచ్చే మహిళల కబడ్డీ అంశం నన్నెంతో ఆకట్టుకుంది. ఈ రెండు పాయింట్స్ నచ్చి ఈ సినిమా చేశా. ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టుకి కోచ్‌గా నటించా. మహిళల కబడ్డీ కోచ్‌గా నేనెందుకు మారాను?, అలా మారటానికి కారణం ఎవరు?, దీని వెనుక ఏం జరిగింది? అనేది పక్కా కమర్షియల్ అంశాలతో దర్శకుడు సంపత్‌నంది అద్భుతంగా తెరకెక్కించాడు. మా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. వాళ్ళు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు.
విజువల్‌గా ఈ సినిమా బాగా రావడానికి మా సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ప్రతిభే కారణం. ఇక మణిశర్మగారి గురించి వేరే చెప్పక్కర్లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తారు. అదే ఆయన గొప్పతనం. పాటలన్ని ఇప్పటికే సూపర్‌హిట్ అయ్యాయి. 'జ్వాలా రెడ్డి..' సాంగ్ నా కెరీర్లోనే టాప్సాంగ్గా నిలిచింది. పెళ్ళిళ్ళు, పార్టీల్లో ఈ పాట మోతమోగిస్తోంది.
తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్‌గా తెలంగాణ స్లాంగ్‌తో పవర్ఫుల్ క్యారెక్టర్లో తమన్నా అద్భుతంగా చేసింది. ఇందులో భూమిక నాకు సిస్టర్‌గా నటించింది. ఆమె వల్ల కథలో ఎలాంటి కీలక మలుపు తిరిగింది? అనేది మాటల్లో కంటే వెండితెర మీద చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి రియల్ ప్లేయర్స్‌తోపాటు కబడ్డీ అంటే ఏమాత్రం తెలియని అమ్మాయిలు రెండు నెలల పాటు ట్రైనింగ్ తీసుకుని మరీ నటించారు. వాళ్ళు పడిన కష్టం సినిమా చూస్తే తెలుస్తుంది. వీళ్ళే కాదు ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. థియేటర్లలో ప్రేక్షకులు సినిమా చూస్తూ విజిల్స్ వేస్తే ఈ కష్టాన్ని ఇట్టే మరచిపోతాం.
నా క్యారెక్టర్ ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన 'రణం', 'లౌక్యం' తరహాలో 'పక్కా కమర్షియల్' సినిమా రాబోతోంది. ఈ కథని మారుతి చాలా బాగా చేశాడు. ప్రతి సీన్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూనే ఉంటుంది.
నాన్నగారు (టి.కృష్ణ) పంథాలో విప్లవాత్మక సినిమాలు చేయాలని ఉంది. అలాంటి కథలొస్తే కచ్చితంగా నటిస్తా. రియాలిటీ సినిమాల కంటే కమర్షియల్ సినిమాల్ని బాగా ఇష్టపడతా.