Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'టక్ జగదీష్'. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈనెల 10న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా కథానాయిక రీతూ వర్మ బుధవారం మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
ఇప్పటి వరకు చేసిన పాత్రలు, సినిమాల్లో ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఇందులో ప్రభుత్వాధికారి గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో నటించాను. గవర్నమెంట్ ఆఫీసర్‌గా అధికారాన్ని చూపించే పాత్ర అయినప్పటికీ చాలా అమాయకంగా ఉంటుంది. మనసులో ఏది ఉంటే అదే మాట్లాడ్డం, కరెక్ట్ అనుకునే దాని కోసం పోరాడే ట్రెడిషన్ ఫ్యామిలీ అమ్మాయిగా కనిపించబోతున్నాను.
నేను బేసిగ్గా సిటీ అమ్మాయిని. ఎప్పుడూ పల్లెటూర్లకి వెళ్లలేదు. అక్కడ ఉండలేదు కూడా. అయితే నేనెక్కువగా మనుషులను గమనిస్తుంటాను. ఎక్కడో చూసిన విషయాలు అలా గుర్తుండిపోతాయి. పైగా నేను దర్శకుడు చెప్పింది చేసే నటిని. ఈ పాత్ర కోసం దర్శకుడు శివ నిర్వాణే ఇన్పుట్స్ ఇచ్చారు.
నానితో ఇది రెండోసారి నటించడం. నాని సెల్ప్ మేడ్ స్టార్. ఆయన గ్రాఫ్ అలా పెరుగుతూనే వస్తోంది. ప్రతీ సినిమాతో ప్రేక్షకుడికి ఏదో ఒక కొత్త ఫీలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' నానికి, 'టక్ జగదీష్' నానికి ఉన్న వ్యత్యాసం చెప్పేంత స్థాయి నాకు లేదు. నాని నటన, ఎంచుకునే కథలు ఇష్టం. మరోసారి నానితో కలిసి నటించాలని ఉంది.
ఇది కమర్షియల్‌గా ఉన్నప్పటికీ రియలిస్టిక్‌గా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ కొత్తగా, యూనిక్‌గా ఉంటూ మంచి వినోదాన్నిస్తుంది. ఇది పక్కా థియేటర్ సినిమా. తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ అవుతోంది.
దర్శకుడు శివ నిర్వాణ సినిమా అంటే ఎమోషన్స్ కచ్చితంగా ఉంటాయి. 'నిన్నుకోరి', 'మజిలి' సినిమాలు చూసినప్పుడు ఆయనతో పని చేయాలని అనుకున్నాను. నేను ఎక్కువగా అర్బన్ ఫిల్మ్స్, మల్టీ ప్లెక్స్ సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరవుతాను.
'వరుడు కావలెను' అక్టోబర్‌లో రిలీజ్ కానుంది. ద్విభాషా చిత్రం 'ఒకే ఒక జీవితం', మరో తమిళ చిత్రానికి సైన్ చేశాను. వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి నటన మీదే దష్టి పెట్టాను. నేనూ సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నా. ఓటీటీ కోసం చిన్న సినిమాలను నిర్మిస్తాను.