Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటించిన చిత్రం 'టక్ జగదీష్'. శివ నిర్వాణ దర్శకుడు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నేటి (శుక్రవారం) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం హీరో నాని మీడియాతో మాట్లాడుతూ, 'ఫస్ట్‌టైమ్ థియేటర్లో నన్ను నేను చూసుకోవడం మిస్ అవుతున్నాను. గత ఏడాది 'వి' సినిమాతో ఓటీటీలో వచ్చాను. ఈసారి ఈ చిత్రంతో వస్తున్నాను. పరిస్థితులు అనుకూలించక పోవడం వల్లే ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. 'భూదేవీపురం, భూమి తగాదాలు.. అంటూ శివ కథ చెప్పడం స్టార్ట్ చేయగానే కనెక్ట్ అయ్యాను. మంచి జోనర్‌ని టచ్ చేయబోతోన్నాడని అర్థమైంది. పైగా శివ ఎమోషన్స్‌ని బాగా హ్యాండిల్ చేయగలరు. అలాంటిది ఫ్యామిలీ సినిమాలను ఇంకా బాగా తెరకెక్కించగలడనే నమ్మకంతో గ్రీన్ సిగల్ ఇచ్చా. పైగా ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఈ సినిమా అనుకున్నప్పుడు టైటిల్ 'టక్ జగదీష్' కాదు. అది క్యారెక్టర్ పేరు. ఇందులో ప్రతీ పాత్రకు మంచి క్యారెక్టర్ పేర్లు ఇచ్చారు. శివలో నాకు అదే నచ్చుతుంది. ఆయన చూసిన, తెలిసిన ఫ్యామిలీ మెంబర్ల పేర్లు పెడతాడు. అందుకే అవి రియలిస్టిక్‌గా ఉంటాయి. అదే పెద్ద బలం. అలా నాకు జగదీష్ అని పెట్టారు. అయితే దానికి టక్ అని ముందు పెట్టారు. అతను టక్ ఎందుకు వేసుకుంటాడు అనేది ద్వితీయార్థంలో రివీల్ చేస్తారు. దీన్ని శివ ఎంతో అద్బుతంగా రాశారు. ఆ సీన్‌కు ఎంతో మంది కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీలో ఉండే అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ముఖ్యంగా అన్నదమ్ములు. బోసు, జగదీష్ మధ్య ఉండే సంఘర్షణను శివ నిర్వాణ ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. థియేటర్ అనేది ఎప్పటికీ ఉంటుంది. థియేటర్లను కొట్టే ఆప్షన్ ప్రపంచంలో లేదు' అని తెలిపారు.