Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1951లో గాంధీజీ ప్రియ శిష్యుడైన ఆచార్య వినోబా బావే అడగ్గానే ప్రధమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి పేదలకు దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమి కోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో పాటు భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన రామచంద్రారెడ్డి జీవిత కథతో ఓ సినిమాని రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయన సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా, నీలకంఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శనివారం ఆచార్య వినోబా బావే 127వ జయంతి సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆయనకు ఘన నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, 'అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లాంటి యోధుల కథలు విన్నాం... అలాగే రామచంద్ర రెడ్డి గారు ఒక్క రక్తపు బొట్టు పడకుండా పేదలకు తన భూమిని దానంగా ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు. అలాంటి మహనీయుడి గురించి భావి తరాలు తప్పకుండా తెలుసుకోవాలి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది' అని చెప్పారు. దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ, 'నేను గాంధీజీ గురించి, అయన సిద్ధాంతాలపై ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అలాంటి అవకాశం ఈ సినిమాతో కలిగింది. రామచంద్ర రెడ్డి గారు ఇచ్చిన మొదటి భూదానం దేశానికి కొత్త అర్థం చెప్పింది. ఆయనది గొప్ప చరిత్ర' అని అన్నారు. 'భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన రామచంద్రారెడ్డి జీవిత కథతో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' చిత్ర సమర్పకులు అరవింద్ రెడ్డి తెలిపారు.