Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాదాపు నాలుగు దశాబ్దాలుగా రచయితగా, నటుడిగా, నిర్మాతగా వి.వి.వామనరావు ప్రేక్షకులకు, పాఠకులకు సుపరిచితులు. పలు నంది అవార్డులు సొంతం చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. తాజాగా ఆయన 'హనీట్రాప్' అనే చిత్రాన్ని నిర్మించారు. ఆయన ఈ చిత్రాన్ని నిర్మించడంతోపాటు కథ, స్క్రీన్ ప్లే అందించి, ఓ కీలక పాత్రలోనూ నటించారు. రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటించారు. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. ఈ చిత్రం ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నటుడు, రచయిత, నిర్మాత వి.వి.వామనరావు శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ, ''హనీ ట్రాప్' అనే రుగ్మత వల్ల చాలా మంది సర్వం కోల్పోతున్నారు. ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. రాజకీయ నాయకులు, డాక్టర్లు, బడా వ్యాపారవేత్తలు... ఇలా ఎంతో మంది బిగ్షాట్లు కూడా ఈ హనీ ట్రాప్‌లో చిక్కుకుని, వాళ్ళ జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఇలాంటి 'హనీ ట్రాప్'లో పడకుండా నేటి యువతను చైతన్యవంతుల్ని చేయాలని ఈ సినిమా చేశాం. 8 ఏళ్ళ క్రితం ఒక పాకిస్తాన్ అమ్మాయి మన నేవీ ఆఫీసర్ని ట్రాప్ చేసి, మన దేశ రహస్య సమాచారాన్ని దోచుకుంది. దీన్ని బేస్ చేసుకుని ఈ కథ రాశాను. అలాగే ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్ గురించి చాలా వార్తలు పత్రికల్లో చదివాను. నేను రాసుకున్న కథని, అందులోని ఉద్దేశ్యాన్ని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి అద్భుతంగా తెరపై చూపించారు. సినిమా చాలా బాగా వచ్చింది. నా తర్వాత సినిమా కూడా ఆయనతోనే చేయబోతున్నా. నేను చాలా నాటకాల్లో, సీరియల్స్‌లోనూ నటించా. ఈ చిత్రంలో కూడా నటించే అవకాశం వచ్చింది. ఒక మినిస్టర్‌కి పి.ఎగా మంచి క్యారెక్టర్ చేశా. సమకాలీన అంశాలతో ఉన్న మా సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అవుతారు. సెన్సార్ సభ్యులు ఎటువంటి కట్స్ లేకుండా 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. కరోనా లాక్డౌన్ తర్వాత తెలంగాణలో అని అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఆంధ్రాలో 3 షోలకు మాత్రమే అనుమతి ఉంది. అక్కడ పరిస్థితులు చక్కబడితే నిర్మాతలకు మేలు జరుగుతుంది' అని తెలిపారు.