Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తలైవి' సినిమా విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నా. మంచి సినిమా చేశాననే ప్రశంసలతోపాటు లాభాలు కూడా వచ్చాయి' అని నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి అన్నారు.
అలనాటి మేటి నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'తలైవి'. జయలలిత పాత్రలో కంగన రనౌత్ నటించిన ఈ చిత్రం ఇటీవల తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలై, విశేష ఆదరణ పొందుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, 'జయలలితగా కంగనాను ఎంపిక చేసినప్పుడూ అందరూ బ్యాడ్ ఛాయిస్ అన్నారు. అప్పట్లో ఆమె గురించి తమిళనాడులో అంతగా తెలియదు. కానీ, సినిమా చూశాక ప్రతీ ఒక్కరూ మేం తప్పుగా అనుకున్నాం, మీ నిర్ణయమే సరైందని చెప్పడం ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాపై ఎలాంటి విమర్శలు లేవు. జయలలిత కుటుంబ సభ్యులు ఈ చిత్రాన్ని చూసి ఆమెకు సరైన ఘన నివాళిగా ఈ సినిమాకి కితాబివ్వడం ఆనందంగా అనిపించింది. తమిళనాడులో స్క్రీన్స్ పెంచే యోచనలో ఉన్నాం. రోజురోజుకూ థియేటర్లలో ప్రేక్షకులు పెరుగుతున్నారు. ఇలాంటి కరోనా పరిస్థితుల్లో ఈ స్థాయి ఆదరణ రావడం అదృష్టంగా భావిస్తున్నాం. స్వతహాగా నాకు బయోపిక్లంటే ఇష్టం. మంచి ఫీల్ ఉంటే వెంటనే నిర్మించేందుకు సిద్ధపడతా. ఇందులో భాగంగానే కపిల్ దేవ్ బయోపిక్ '1983'ని తెరకెక్కించాం. దీని థియేటర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం. సోషల్ మీడియా మీద 'ట్రెండింగ్' పేరుతో ఓ సినిమా చేస్తున్నాం. ఓ పెద్ద దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్గా విడుదల చేస్తాం. ప్రధానమంత్రి అధికారి కార్యాలయం చుట్టూ తిరిగే మరో కథను తెరకెక్కిస్తున్నాం. 'ఆజాద్ హింద్' అనే దేశభక్తి సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు.