Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'హనీ ట్రాప్'. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వి.వి.వామనరావు నిర్మించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నెల 17న ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'నా దర్శకత్వంలో తెరకెక్కిన 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ', 'ఒక క్రిమినల్ ప్రేమ కథ' లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు తెరకెక్కించిన ఈ సినిమా కూడా అలాంటి కోవకు చెందిన ఓ మంచి సందేశం ఉన్న సినిమా. మా నిర్మాత వామనరావు ఈ కథని ప్రిపేర్ చేశారు. 'హనీ ట్రాప్' అనేది యూనివర్సల్ టాపిక్. ప్రతిరోజూ మనం పత్రికల్లో హనీ ట్రాప్ వార్తల్ని చదువుతూనే ఉన్నాం. ఈ ట్రాప్‌లో చాలా మంది ఏదో రకంగా చిక్కుకుని సర్వం కోల్పోతున్నారు. అలాగే ఈ ట్రాప్‌లో పడి అమ్మాయిలు, అబ్బాయిలూ మోసపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు చాలా సులభంగా మోసం చేస్తున్నారు. ఇలాంటి అంశాల సమాహారంగా ఆద్యంతం యూత్‌ని ఆకర్షించే విధంగా సినిమాని తెరకెక్కించాను. ఈ సినిమాతోనూ రుషి, మిస్ వైజాగ్ శిల్ప, తేజు వంటి వాళ్ళని నాయకానాయికలుగా పరిచయం చేస్తున్నా. మా నిర్మాత కూడా మంచి పాత్ర చేశారు. 'లజ్జ' ఫేమ్ శివకార్తీక్ యువ రాజకీయనాయకుడిగా నటించారు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్‌తో ఉంటుంది. నేను చేసే ప్రతి సినిమాలోనూ అంతర్లీనంగా రొమాన్స్ ఉంటుంది. నాకు అవార్డులు తెచ్చిపెట్టిన 'సొంత ఊరు', 'గంగ పుత్రుల్లో' కూడా రొమాన్స్ ఉంది. మన తల్లిదండ్రుల ప్రేమకు చిహ్నమే మనం. మరి అలాంటి ప్రేమని ఎందుకు చూపించకూడదు?, మన సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను ధైర్యంగా మనమెందుకు చర్చించుకోవటం లేదు?, అలాంటి విషయాలను ఆవిష్కరిస్తూ నేను 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ', 'ఒక క్రిమినల్ ప్రేమకథ' వంటి సినిమాలు చేశాను. అలాగే ఈ సినిమాలోనూ ఉంటుంది. ఈ నెల 17న విడుదలవుతున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ప్రస్తుతం 3 సినిమాలు నా దర్శకత్వంలో తెరకెక్కుతున్నాయి. వీటిల్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పే రీతిలో 'వెల్కమ్ టు తీహార్ కాలేజీ' ఉంటుంది. అలాగే చదలవాడ శ్రీనివాసరావు బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాను. ఇది తండ్రీ కొడుకుల కథ. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. మరో సినిమాని బాపిరాజు గారు నిర్మిస్తున్నారు. త్వరలోనే వీటి వివరాలను తెలియజేస్తాను' అని అన్నారు.