Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగీత దర్శకుడు, యాడ్ ఫిల్మ్ మేకర్ శశి ప్రీతమ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా 'లైఫ్ ఆఫ్ 3'. కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఛాయాగ్రహణ, గీత రచన, సంగీత దర్శకత్వ బాధ్యతలను కూడా శశి ప్రీతమ్ నిర్వర్తించడం విశేషం. ఆయన కుమార్తె ఐశ్వర్య కష్ణప్రియ నిర్మించిన ఈ చిత్రానికి దుష్యంత్ రెడ్డి సహ నిర్మాత. స్నేహాల్ కామత్, సంతోష్ అనంతరామన్, చిన్నికష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. బుధవారం శశి ప్రీతమ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్, ఆడియోని విడుదల చేశారు.
ఈ సందర్భంగా శశి ప్రీతమ్ మాట్లాడుతూ, 'జనవరిలో 'లైఫ్ ఆఫ్ 3' సినిమా ప్రారంభించాం. గతేడాది తీవ్ర గుండెపోటుకు గురైనప్పుడు చావును దగ్గర్నుంచి చూశా. దాన్నుంచి చాలా నేర్చుకున్నా. చివరి క్షణం వరకూ పోరాటం చేయడం ఆపవద్దు, నెవర్ గివ్ అప్ అనే సందేశాన్ని ఈ సినిమా ఇస్తుంది. మనం ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉన్నంత సేపూ జీవితం అనేది ఒక ఆటలా ఉంటుంది. ఆ ఉద్దేశ్యంతోనే ఈ కథ రాశా. చాలామంది కొత్త నటీనటులతోపాటు పాటల ద్వారా కొత్త గాయనీగాయకులను కూడా పరిచయం చేస్తున్నాం. ఈ సినిమా నిర్మించిన మా అమ్మాయి ఐశ్వర్యకు, ఆమెకు మద్దతుగా నిలిచిన దుష్యంత్ రెడ్డికి థ్యాంక్స్' అని చెప్పారు.
నిర్మాత ఐశ్వర్య కష్ణప్రియ మాట్లాడుతూ, 'నా చిన్నప్పటి నుండి నాన్నతో చాలా ప్రాజెక్టులు చేశా. నా కోసం ఆయన ఎన్నో చేశారు. నాన్న కోసం నేను నిర్మాతగా మారాలని అనుకున్నాను. ఓ టెక్నీషియన్‌గా, ప్రొడ్యూసర్‌గా నా తొలి అడుగు ఇది. నాన్నకు మద్దతుగా ఉండాలని వేశా' అని తెలిపారు.
'ఇందులో గాయనీగాయకులు అందరూ బాగా పాడారు. ప్రతి ఏడాది పాటలు మారుతూ ఉంటాయి. తరం మారినప్పుడు సంగీతం మారుతుంది. ప్రజల అభిరుచి మారుతుంది. కానీ, శశి ప్రీతమ్ పాటలు ఇప్పుడు ప్లే చేసినా, కొత్త తరం కూడా వింటారు. ఓ మంచి కాన్సెప్ట్‌తో అందరిన్నీ ఇన్స్పైర్ చేసే రీతిలో ఉన్న మా సినిమా తప్పకుండా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని సహ నిర్మాత దుష్యంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెరుమాళ్ళు, స్నేహాల్ కామత్, సంతోష్ అనంతరామన్, వైశాలి, సౌజన్య వర్మ, సీవీఎల్, జోసెఫ్ సుందర్, శాస్త్రి ఏఆర్కే, రాజేష్, వీరేన్ తంబిదురై, అనిరుధ్ మంత్రిప్రగడ, విశ్వనాథన్, అజిత్ శుక్లా, వరుణ్ సాధు, ఫహీమ్ సహా గాయనీగాయకులు ఎన్.సి. కారుణ్య, సమన్విత శర్మ, ప్రత్యూష శర్మ, ప్రత్యూష పాళ్ళూరి, ఆదిత్య, విద్యా నారాయణ రాఘవన్, మదులా శర్మ, వందనా సుశీల్, సుశీల్ కుమార్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.