Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'లవ్ స్టోరి'. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతల్లో ఒకరైన నారాయణదాస్ నారంగ్ మాట్లాడుతూ, 'మేం ఎన్నో ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సెక్టార్లో ఉన్నా, ఎప్పుడూ నిర్మాణం గురించి ఆలోచించలేదు. మాకు ఉన్న అనుభవంతో మిగతా సెక్టార్స్‌లో రాణించినా, నిర్మాణం అనేది కొత్త విషయం. ఇక్కడ డబ్బుతో పాటు అనేక విషయాలు ఆధారపడి ఉంటాయి. టీమ్ వర్క్‌లా పనిచేయాలి. క్రియేటివిటీ చూపించాలి. దీంతో ప్రొడక్షన్ గురించి బాగా అవగాహన వచ్చాకే, నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. ఈ సినిమాని గతేడాది విడుదల చేయాల్సింది. లాక్ డౌన్ వల్ల వాయిదా వేస్తూ వచ్చాం. ఇప్పుడు థియేటర్స్‌లో విడుదల చేస్తున్నందుకు థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాం. మంచి ఎమోషన్స్ ఉన్న ఫీల్ గుడ్ సినిమా. ఇలాంటి సినిమాలను థియేటర్స్‌లోనే ఎంజారు చేయగలం. అందుకే ఓటీటీలు ఎన్ని సంప్రదించినా మా చిత్రాన్ని ఇవ్వలేదు' అని తెలిపారు.
మరో నిర్మాత పుస్కూర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, 'శేఖర్‌కమ్ముల మార్క్ ఎమోషన్స్‌తో ఉన్న ప్రేమకథా చిత్రమిది. ప్రేమకథతో పాటు కొన్ని అంశాలను జోడించి తన స్టయిల్లో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. నాగచైతన్య, సాయిపల్లవి తమ నటనతో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. ఏపీలో థియేటర్ల టికెట్ ధరలు, బుకింగ్ విధానం, ఇతర విషయాలపై ప్రభుత్వంతో సంప్రదించేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ని కలవబోతున్నాం' అని అన్నారు.