Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పరీక్షలు, వాటిల్లో వచ్చే మార్కులు.. ఇవేవీ ప్రాణం కంటే గొప్పవి కావు. అన్నింటికంటే ముఖ్యం ప్రాణమే' అని హీరో సూర్య అన్నారు.
'నీట్' పరీక్షకు భయపడి ఇటీవల తమిళనాడుకి చెందిన ఇద్దరు విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా, విద్యార్థులకు మరింత ధైర్యం చెప్పేలా హీరో సూర్య వీడియో రూపంలో ఓ సందేశాన్ని రిలీజ్ చేశారు.
విద్యార్థులందరూ ఎలాంటి భయాందోళనలు లేకుండా, 'జీవితంపై పూర్తి నమ్మకంతో జీవించాలని ఓ అన్నగా కోరుకుంటున్నా. ఒక పరీక్ష.. మీ ప్రాణాల కంటే పెద్దదికాదు. భయం, వేదన, విరక్తి, దిగులు ఇలాంటి విషయాలు కేవలం కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటల్లో తగ్గిపోయే సమస్యలు. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి మీ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులను గుర్తు చేసుకోండి. మీరు తీసుకునే బలవన్మరణ నిర్ణయం వారిని జీవితాంతం క్షోభకు గురిచేస్తూనే ఉంటుంది. పరీక్ష, మార్కులు అనే రెండు అంశాలే జీవితం కాదు. జీవితంలో సాధించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నమ్మకం, ధైర్యంతో ఉంటే ప్రతి ఒక్కదాన్ని జయించవచ్చు' అని వీడియో సందేశంలో సూర్య తెలిపారు. ప్రస్తుతం 'జైభీమ్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పేదలకు అండగా నిలిచే లాయర్ పాత్రలో సూర్య కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సైతం ఆయన ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.