Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'లవ్‌స్టోరీ' చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్
'దేశ వ్యాప్తంగా ఏ విపత్తు జరిగినా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. కానీ, కరోనా కారణంగా ఇండిస్టీ ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి తరుణంలో ఆదుకోవాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. పరిశ్రమ సాధక, బాధకాలను గుర్తించి తగిన సాయం చేయండి' అని చిరంజీవి రెండు తెలుగు ప్రభుత్వాలను కోరారు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్రావు నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈచిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని 'లవ్‌స్టోరీ అన్ప్లెగ్డ్' పేరుతో చిత్ర బృందం అంగరంగ వైభవంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్, చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ,'కరోనా కారణంగా ఇండిస్టీ సంక్షోభంలో పడిపోయింది. నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోవడానికి కారణాలు ఏంటి?, ఇంకా ఏం చేస్తే చిత్ర పరిశ్రమ బాగుంటుంది? ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు ఆదుకోవాలి. మేము ఆశగా అడగటం లేదు, అవసరానికి అడుగుతున్నాం. అది మీరు ఒప్పుకోవాలని కోరుతున్నా. వీలైనంత త్వరగా చిత్ర పరిశ్రమకు మేలు చేసే జీవోలను విడుదల చేయండి. సినిమాలు పూర్తయి కూడా మరో సినిమా చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడిపోయాం. 'ఆచార్య' అయిపోయింది. ఎప్పుడు విడుదల చేయాలి?, ఎలా రిలీజ్ చేయాలి?, చేస్తే రెవెన్యూ వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు వెంటాడుతున్నాయి. జనాలు వస్తారా? లేదా అనే దాన్నుంచి ఇప్పుడిప్పుడే ధైర్యం వస్తోంది. 'లవ్‌స్టోరీ' అన్నింటికీ దారి చూపే సినిమా అవుతుందని అనుకుంటున్నా' అని చెప్పారు.
''లాల్ సింగ్ చద్దా' కోసం నాగచైతన్యని ఫస్ట్‌టైమ్ కలిశాను. ఆయనతో పని చేస్తుంటే, ఎప్పట్నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. ఈ సినిమాని నేను కూడా థియేటర్లోనే చూస్తాను. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ దర్శకుడు శేఖర్ కమ్ములపై చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోయా. అలాగే సాయిపల్లవి డాన్స్ వీడియోలను యూ ట్యూబ్‌లో చూశా. ఈ సినిమాలోని ఓ పాటలో ఆమెని చూసి అభిమానిగా మారిపోయా' అని అమీర్‌ఖాన్ అన్నారు. 'నేను బాగా అభిమానించే అమీర్‌ఖాన్ ఈ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. 'లీడర్' సినిమాలో అరవై ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా కుల వివక్ష ఉందని ఓ డైలాగ్ రాశా. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈ సినిమా తీశా' అని దర్శకుడు శేఖర్‌కమ్ముల తెలిపారు. 'ఈ ఫంక్షన్‌కి చిరంజీవి, అమీర్‌ఖాన్ రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కథ నన్నెంతో ఇన్స్పైర్ చేసింది. క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయి చేశా. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది' అని హీరో నాగచైతన్య చెప్పారు.
సాయిపల్లవితో చిరు స్టెప్పులు
'ఇటీవల నేను చేయాలనుకున్న ఓ చిత్రంలో చెల్లిలి పాత్ర కోసం సాయిపల్లవి అడిగితే, ఆమె నో చెప్పింది. దీనికి నేనెంతో సంతోషపడుతున్నా. ఎందుకంటే అంతమంచి డ్యాన్సర్‌తో డ్యాన్స్ చేయాలని కోరుకుంటాను కానీ.. చెల్లెలిగా అంటే నాకే మనసు అంగీకరించలేదు. అంత మంచి డ్యాన్సర్ సాయిపల్లవి. 'ఫిదా' సినిమా టైమ్‌లో కూడా వరుణ్ ఓ పాటను చూపించి, నా డ్యాన్స్ ఎలా ఉంది అని అడిగితే, నేను.. నిన్ను చూడలేదురా.. సాయిపల్లవినే చూస్తుండి పోయాను అని చెప్పా. అందుకే సాయిపల్లవితో డ్యాన్స్ చేసి, నేను కూడా డ్యాన్సర్ అని ప్రూవ్ చేసుకుంటా' అని సరదాగా సాయిపల్లవిని చిరంజీవి ఆటపట్టిస్తే,
'మీ మాటల్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను సార్. నిజంగా నేను మీ సినిమాలో చేయనని చెప్పలేదు. నేను రీమేక్ సినిమాలను చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాను. అందుకే మీ సినిమాలో చేయనని చెప్పానే తప్ప వేరే ఎటువంటి ఉద్దేశం లేదు' అని సాయిపల్లవి వివరణ ఇచ్చిన తీరు అందర్నీ నవ్వించింది. ఇదిలా ఉంటే, సాయిపల్లవితో కలిసి చిరు వేసిన స్టెప్పులు ఆహుతుల్ని విశేషంగా అలరించాయి.