Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కుల వివక్షతతోపాటు ఆడ, మగ తారతమ్యం.. ఈ రెండు విషయాలను 'లవ్‌స్టోరీ' సినిమాలో ఫుల్ఫోకస్డ్గా చూపించాను. చరిత్రలో నిలిచిపోయిన ప్రేమకావ్యాల స్ఫూర్తితో ఈ సినిమా చేశా' అని అంటున్నారు దర్శకుడు శేఖర్‌కమ్ముల. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లవ్‌స్టోరీ'. అమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. ఈనెల 24న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో సోమవారం దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో సంభాషించారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
ఇదొక ఫీల్ గుడ్ మూవీ. ఒక అమ్మాయి, అబ్బాయికి మధ్య ఉండే రొమాన్స్, మ్యూజిక్ అన్నీ కూడా ఉంటాయి. వాటితో పాటుగా మరో కీలక పాయింట్ ఈ సినిమాని మరో స్థాయిలో పెట్టేలా ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న ఓ పాయింట్ ప్రతీ ఒక్కరికీ టచ్ అయ్యేలా ఉంటుంది. నా గత సినిమాల్లాగే ఇది కూడా మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది.
తెలంగాణా స్లాంగ్‌లో చైతూని ముందు సినిమాల్లో చూపించని విధంగా ట్రై చేశాం. ఈ సినిమాలో కొత్త నాగచైతన్యని చూడబోతున్నారని నమ్మకంగా చెబుతున్నా.
'ఫిదా'లో సాయిపల్లవి రోల్ ఒకలా ఉంటుంది. కానీ ఈ సినిమాలో దానికి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుంది. తనలోనే తాను మధనపడుతూ, స్ట్రగుల్ అవుతూ ఉండేలా కనిపిస్తుంది. చాలా షేడ్స్ ఉన్న రోల్లో అద్భుతంగా నటించింది.
ఏ.ఆర్. రెహ్మాన్ దగ్గర వర్క్ చేశాడని పవన్‌ని తీసుకోలేదు. ఆయన ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తాడనిపించింది. నేను పెట్టుకున్న అంచనాలకి మించే మ్యూజిక్ ఇచ్చాడు. పవన్‌కి ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది.
నేనే కాదు ఎవరైనా సరే, తమ సినిమాలు చరిత్రలో నిలిచేలా ఉండాలనే తీస్తారు. ఇందులో కూడా ఆ షేడ్స్ ఉన్నాయి. నాగార్జున గారు 'ప్రేమ్ నగర్' సినిమా రిలీజ్ రోజున ఇది కూడా రిలీజ్ అవుతుందని సోషల్ మీడియాలో పెట్టారు. ఆ సినిమా సక్సెస్‌లో ఈ సినిమా ఒక 30% అందుకున్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నా సినిమా ఏదైనా సరే, ఒక పదేళ్ళ తర్వాత.. నా పిల్లలకి కూడా గర్వంగా చూపించగలగాలి అనుకుంటా.
ప్రీ రిలీజ్ ఈవెంట్ నా జీవితంలో ఓ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. చిరంజీవి,ఆమీర్‌ఖాన్ వంటి దిగ్గజాలు ఈవెంట్‌కు హాజరై, ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. కరోనావంటి విపత్కర పరిస్థితుల్లో వేరే నిర్మాతలు అయితే ఖచ్చితంగా ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేసేవాళ్ళు. కానీ మా నిర్మాతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే వారికి తెలుసు సినిమా అంటే థియేటర్స్‌లోనే చూడాల్సిందని.
'లీడర్' సినిమా సీక్వెల్ ఖచ్చితంగా చేస్తా, ఆ కథ కూడా రానాతో నడిచే విధంగా చేస్తాను. అయితే దీనికి కొంచెం టైమ్ పడుతుంది. అలాగే ధనుష్‌తో చేసే సినిమా నా గత సినిమాల్లా కాకుండా థ్రిల్లర్ టైప్‌లో ఉంటుంది. పైగా కథ రేంజ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే మల్టీ లాంగ్వెజెస్ సినిమాగా దీన్ని చేస్తున్నాం.