Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత నాలుగు దశాబ్దాలుగా సినిమా పబ్లిసిటీ డిజైనింగ్‌లో విశేష సేవలందించిన సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (84) ఇకలేరు. మంగళవారం తెల్లవారు జామున చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
తనదైన మార్క్ పోస్టర్ డిజైనింగ్‌తో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిన ఈశ్వర్ అసలు పేరు కొసనా ఈశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఆయన స్వస్థలం. చిన్నతనం నుంచే బొమ్మలు వేయటమంటే ఆసక్తి. ఆ ఆసక్తితోనే పాలిటెక్నిక్ కోర్సుని మధ్యలోనే ఆపేసి, పబ్లిసిటీ ఆర్టిస్ట్‌గా రాణించేందుకు చెన్నై వెళ్ళారు. ఆర్టిస్ట్ కేతా వద్ద పోస్టర్ డిజైనింగ్‌లో తర్ఫీదు పొంది, 'ఈశ్వర్' పేరుతో సొంత సంస్థని ఆరంభించి, పోస్టర్లకి డిజైన్ చేయటం ఆరంభించారు. బాపు దర్శకత్వం వహించిన 'సాక్షి' (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా ప్రారంభమైన ఈశ్వర్ ప్రయాణం అప్రహాతితంగా 40 ఏండ్ల పాటు నిర్విరామంగా సాగింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 2600లకు పైగా చిత్రాలకు పని చేశారు. విజయా, ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను కూడా ఆయన డిజైన్ చేశారు. ఆయన పని చేసిన ఆఖరి చిత్రం 'దేవుళ్ళు' (2000). పబ్లిసిటీ రంగంలో తనదైన మార్క్‌తో రాణించిన ఆయన 'సినిమా పోస్టర్' అనే పుస్తకాన్ని రాశారు. దీనికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో నంది పురస్కారం (2011) లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గాను 2015లో ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచితంగా సత్కరించింది. ఆయనకు భార్య (వరలక్ష్మి), ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈశ్వర్ ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
నాన్న(ఎన్టీఆర్) సినిమాలతోపాటు నేను హీరోగా నటించిన కొన్ని చిత్రాలకూ ఈశ్వర్ పని చేశారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. బహుముఖ ప్రజ్ఞాశాలి మనమధ్య లేకపోవడం బాధాకరం. - నందమూరి బాలకృష్ణ
ఈశ్వర్ గారితో మా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకి విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన మా సంస్థలో అత్యధిక చిత్రాలకు పనిచేశారు. నాన్న(రామానాయుడు)గారికి ఆయన డిజైన్స్ అంటే ఎంతో ఇష్టం. కేవలం పబ్లిసిటీ డిజైనర్‌గానే కాకుండా ఎన్నో సినిమాలకి క్యారెక్టర్ పోస్టర్స్ కూడా డిజైన్ చేశారు. - సురేష్‌బాబు