Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాబాయ్, అబ్బాయ్ వెంకటేష్, రానా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఇద్దరితో 'రానా నాయుడు' అనే డ్రామా సిరీస్‌ను తెరకెక్కించేందుకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ సిద్ధమైంది. లొకోమోటివ్ గ్లోబర్ ఇంక్ అనే సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అమెరికన్ పాపులర్ డ్రామా 'రే డోనోవన్' షో టైం నుంచి కాన్సెప్ట్‌ను తీసుకుని ఈ సిరీస్‌ను రూపొందించ బోతున్నారు. త్వరలోనే చిత్రీకరణ ఆరంభం కానుంది. కరన్ అన్షుమాన్ షో రన్నర్ మాత్రమే కాకుండా దర్శకుడి గానూ వ్యవహరిస్తున్నారు.
ఈ సిరీస్ గురించి వెంకటేష్ మాట్లాడుతూ, 'రానాతో కలిసి పని చేసేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నాను. మేమిద్దరం కలిసి తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాం. ఇది మాకు పర్ఫెక్ట్ ప్రాజెక్ట్. నేను 'రే డోనోవన్'కు వీరాభిమానిని. ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా' అని చెప్పారు. 'మా చిన్నాన్నతో కలిసి మొట్టమొదటి సారిగా నటించడం, అది కూడా నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలో పని చేయడం ఆనందంగా ఉంది. ఇది మా కెరీర్లోనే ఎంతో భిన్నమైన ప్రాజెక్ట్. ఇటువంటిది మేం ఎప్పుడూ చేయలేదు. ఇది ఛాలెంజింగ్‌గా ఉన్నప్పటికీ కూడా ఎంతో సరదాగా ఉండోబోతోందనే నమ్మకం ఉంది. సెట్లోకి అడుగుపెట్టేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను' అని రానా తెలిపారు.