Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మా' ప్రెసిడెంట్ అనేది ఒక బిరుదు కాదు.. బాధ్యత. దాన్ని నేను సమర్థవంతంగా నిర్వహించగలననే నమ్మకంతో పోటీ చేస్తున్నా. ఈ తరహాలో ఈ ఎన్నికలు జరగడం పట్ల మేమెవరమూ సంతోషంగా లేం. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం నాన్న (మోహన్‌బాబు)కు కూడా ఇష్టం లేదు. నాన్న 46 ఏండ్ల నట జీవితంలో ఈ స్థాయిలో నటులు విడిపోలేదు. ఇంత బీభత్సంగా ఎన్నికల సన్నాహాలు జరగలేదు' అని హీరో మంచు విష్ణు అన్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో భాగంగా తన ప్యానెల్ సభ్యులతో కలిసి మంచు విష్ణు శుక్రవారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,''మా' పుట్టి 25 సంవత్సరాలు అయింది. తెరపై చూసినట్లు నటీనటులు ఖరీదైన జీవితాలను గడుపుతారని చాలా మంది అనుకుంటారు. కానీ, మేకప్ తీసి ఇంటికి వచ్చిన తర్వాత మేమూ మీలాగే జీవిస్తాం. ఒక నటుడికి ఈ ఏడాది మొత్తం పని ఉండొచ్చు. వచ్చే ఏడాది కనీసం మూడు నెలలు కూడా పని దొరకని పరిస్థితి ఏర్పడొచ్చు. నటుడి కష్టాలు, ఆవేదన అతడికే తెలుస్తుంది. వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఆ బాధ ఎవరితోనూ పంచుకోలేం. ఆర్టిస్ట్‌ల కోసం, మా అందరి కోసం 'మా' ఉంది. మా ప్రెసిడెంట్ అనేది ఒక బిరుదు కాదు.. బాధ్యత. ఒకప్పుడు నాకు అనుభవం లేదని నాన్న అధ్యక్ష పదవికి వద్దన్నారు. అయితే ఇప్పుడు కచ్చితంగా 'మా'లో మార్పు తీసుకురాగలననే ధైర్యంతో పోటీ చేస్తున్నా. 'మా'లో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా మా ప్యానెల్‌కు ఉంది. ప్రత్యర్థి ప్యానెల్లో మంచి నటులు ఉన్నారు. వారిలో కొందరు నా బ్యానర్‌లోనూ పనిచేశారు. ఒక నిర్మాతగా వాళ్లను నా సినిమాల్లోకి తీసుకుంటా. కానీ 'మా' అసోసియేషన్‌లో పనిచేసేంత సామర్ధ్యం వాళ్లకు లేదు. ఈ విషయంలో నాకన్నా ఎవరూ బాగా పనిచేయలేరు. దీన్ని ఎక్కడైనా చెబుతా. 'మా' ఒక ఛారిటీ ఆర్గనైజేషన్ కాదని ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ అంది. పెద్దలకు పింఛన్ ఇవ్వడాన్ని ఛారిటీ అని ఎలా అంటారు? అది మన బాధ్యత. 'మా'లో ఉన్న 900 మందికి లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడమే నా ప్రాధాన్యం. ఎడ్యుకేషన్ పాలసీని ఆలోచిస్తున్నాం. నిర్మాతలు మనకు దేవుళ్ళు. అలాగే కొత్తగా ఓటీటీలూ వస్తున్నాయి. అందరి సహకారంతో ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే నా లక్ష్యం' అని చెప్పారు.