Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ హరిచందన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'విక్రమ్'. ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని 'కలయా నిజమా..' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను గీత రచయిత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ పాటలో రచయిత కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యాన్ని పొందుపరిచారు. సందర్భాను సారంగా వచ్చే విషాదభరిత ఈ పాట గుండెలను పిండేశాలా ఆకట్టుకుంటోంది. హీరో నాగవర్మ తన హావభావాలతో పాటను రక్తికట్టించారు. సురేష్ ప్రసాద్ సంగీతం, సత్య మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు ప్రాణం పోశాయి. సినిమా విజయవంతం కావాలని ఆశిస్తున్నాను' అని చెప్పారు.
'ఈ చిత్రంలో అద్భుతమైన సాహిత్యంతో ఉన్న ఈ పాటను చంద్రబోస్ గారు ఆవిష్కరించడం ఎనలేని ఆనందంగా ఉంది. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఏ పాటకు ఆ పాట పోటాపోటీగా అలరిస్తాయి. సమష్టి కషితో చిత్రం చాలా బాగా వచ్చింది' అని హీరో, నిర్మాత నాగవర్మ తెలిపారు.
దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ, 'సంగీతభరిత ప్రేమ కథకు, థ్రిల్లర్ అంశాలను మేళవించి కొత్త పంథాలో ఈ చిత్రాన్ని మలిచాం. ఓ సినీ రచయిత పాత్ర చుట్టూ తిరిగే ఈ చిత్రకథలోని పాత్రలు సహజత్వానికి దగ్గరగా, మనం నిత్యం చూసే వ్యక్తుల మాదిరిగా ఉంటాయి. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినీ రచయిత ఏం చేశాడన్నది ఆసక్తికరంగా చెప్పాం' అని అన్నారు. 'ఇందులోని ఐదు పాటలు సందర్భానుసారంగా సాగుతూ, కథను ముందుకు నడిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగా వచ్చింది' అని సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్ చెప్పారు. కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ, 'ఇందులోని అన్ని పాటలకు కొరియోగ్రఫీ అద్భుతంగా కుదిరింది' అని అన్నారు.