Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం 'ఇదే మా కథ'. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జీ.మహేష్ నిర్మించిన ఈ చిత్రానికి గురు పవన్ దర్శకుడు. ఈ చిత్రం నేడు (శనివారం)విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు గురుపవన్ మాట్లాడుతూ, 'ఐదు వేల కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ ఈ కథని రాశా. రోడ్ జర్నీ నేపథ్యంలో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ సినిమాను ఎలాగైనా సరే థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాత ఫిక్స్ అయ్యారు' అని చెప్పారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ, 'ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎమోషన్ అయ్యేలా చేసిన సినిమా ఇదే. శ్రీకాంత్, భూమిక,సుమంత్, తాన్యలు అంత అద్భుతంగా నటించారు' అని తెలిపారు.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకెంతో స్పెషల్. సౌత్ నుంచి నార్త్ వరకు అంతా చూపించాం. ఇందులో బాగా చేశానని ఎవరైనా అంటే, అది శ్రీకాంత్ గారి వల్లే' అని తెలిపారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకు మంచి ఎక్స్పీరియన్స్. ఫీల్ గుడ్ కథ. ఓ నలుగురి కథ. వారి లక్ష్యాలు ఏంటి?, వాటిని ఎలా చేరుకున్నారు?, ఒకరినొకరు ఎలా హెల్ప్ చేసుకున్నారు అనేదే కథ. ఇలాంటి కథలను ఎలా డీల్ చేయాలి?, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి?, నిర్మాతను ఒప్పించడం అనేది చాలా కష్టం అని దర్శకుడు గురుకు చెప్పాను. సినిమా మీద ప్యాషన్ ఉంది కాబట్టే.. మహేష్ లాంటి నిర్మాత ఈ సినిమా తీశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి సినిమా చూశాం. ఎంతో అద్భుతంగా ఉంది. నేను పలువురు హీరోలతో సినిమాలు చేశాను. కానీ యంగ్ హీరోతో పని చేయడం ఇదే మొదటిసారి. సుమంత్‌ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎంతో భవిష్యత్తు ఉంది. డైలాగ్ డెలివరీ, అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉన్న నటుడు. ఈ సినిమా సక్సెస్ అవుతుంది. కచ్చితంగా సుమంత్‌కు పేరు వస్తుంది' అని చెప్పారు.