Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత, దర్శకుడు సి.వి.రెడ్డి త్వరలో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నారు. సీవీ ఆర్ట్స్ పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి 'ఆఖరి ముద్దు' అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత సి.వి.రెడ్డి మాట్లాడుతూ, 'ఆలోచింపజేసే కథాంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాను. కథాపరంగా
ఈ చిత్రానికి 'ఆఖరి ముద్దు' అనే టైటిల్ యాప్ట్ అనిపించింది. అందుకే ఈ టైటిల్‌ని ఫిక్స్ చేశాం. ఈ కథ నన్నెంతో ప్రభావితం చేసింది. ముఖ్యంగా సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని రూపొందిస్తున్నా. అయితే ఈ చిత్రానికి 'ఆఖరి ముద్దు' అనే టైటిల్‌ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటు, దర్శకత్వం వహిస్తూ స్వయంగా నిర్మిస్తున్నాను. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. 'పెళ్లి గోల', 'విజయరామరాజు', 'శ్వేత నాగు', 'ఆడుతూ పాడుతూ' వంటి సూపర్ హిట్ చిత్రాల నిర్మాణంతో నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా పరిశ్రమలో నాకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌ని మరింత పెంచేలా ఈ చిత్రం ఉండబోతోంది. నేషనల్ ఫిలిం అవార్డ్స్, ఇండియన్ పనోరమా కమిటీ మెంబర్‌గా, ప్రతిష్టాత్మక ఆస్కార్ కమిటీకి చైర్మన్‌గా గౌరవ ప్రదమైన సేవలందించాను. దీంతో దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని హంగులతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం, మా బ్యానర్‌కి మరింత మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా' అని తెలిపారు.