Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా, లాక్డౌన్ కారణంగా అక్టోబరు 13కి వాయిదా పడింది. పరిస్థితులు ఇంకా పూర్తి స్థాయిలో చక్కబడకపోవడం, ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లు, ఆన్లైన్ టిక్కెట్ల వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడం, అలాగే ఈ సినిమాకి సంబంధించి నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నామంటూ చిత్ర బందం ప్రకటించింది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి పుల్‌స్టాప్ పెడుతూ చిత్ర బృందం శనివారం ఓ కొత్త డేట్‌ని ఎనౌన్స్ చేసింది. వచ్చే ఏడాది, జనవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుండటం పట్ల అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు రామ్‌చరణ్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. బాలీవుడ్ నాయిక అలియాభట్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్ కథానాయిక ఒలీవియా మోరీస్ మెరవబోతున్నారు. అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్, అజరు దేవ్గన్, శ్రియ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్నారు.