Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీశ్రీ హాథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై కె.పి.ఎన్. చౌహాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సేవాదాస్'. ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బంజారా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర ఆడియో వేడుక రవీంద్రభారతిలో అత్యంత వైభవంగా జరిగింది. భోలే షావలి ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించారు.
బంజారా సంప్రదాయపు డప్పులు, నత్యాలు, వేషధారణలతో ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించిన ఈ వేడుకలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, 'ఇది ఆడియో వేడుకలా లేదు. శత దినోత్సవ వేడుకలా ఉంది. ఈ సినిమా కచ్చితంగా 100 రోజులు ఆడాలి. ఆ వేడుకకి కూడా ముఖ్య అతిథిగా నన్నే పిలవాలి' అని అన్నారు. మరో అతిథి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, 'బంజారా బిడ్డలు బంజారా భాషలోనే కాకుండా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తీసిన ఈ చిత్ర ఆడియో వేడుకలో పాల్గొనడం గర్వంగా ఉంది' అని చెప్పారు.
'ఈ సినిమా రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈనెల 15న ఇల్లందులో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఈనెలాఖరుకు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం' అని నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ ఎమ్.పి శ్రీమతి మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ బానోత్, ఖానాపూర్ ఎమ్.ఎల్.ఎ. శ్రీమతి రేఖా శ్యామ్ నాయక్, డోర్నకల్ ఎమ్.ఎల్.ఎ. రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎమ్.ఎల్.ఎ. శంకర్ నాయక్, వైరా ఎమ్మెల్యే ఎల్.రాములు నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, బోద్ ఎమ్మెల్యే రాథోడ్ బాబూరావు, మహబూబాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్‌తోపాటు పలువురు ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఆర్.ఎస్ అధికారులు విశిష్ట అతిథులుగా పాల్గొని ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.