Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'మహా సముద్రం'. అజరు భూపతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
దసరా కానుకగా ఈనెల 14న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ,'ఇది ఎంతో ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమా. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా ఓ తెలీని మౌనంతో వెళ్తారు. చివరి 40 నిమిషాలు మాత్రం ఎవ్వరూ ఏం మాట్లాడకుండా చూస్తారు. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం. అందరి అంచనాలు మించేలా కూడా ఉంటుంది. మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అదే 'మహాసముద్రం'. అమాయకపు మనుషుల జీవిత కథలే ఇందులో కనిపిస్తాయి. 'మహా' చుట్టూ ఉండే పాత్రలు.. కథ.. ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుంది. ఇలాంటి కథకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇంత ఇంటెన్స్ ఉన్న సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండరు. మ్యూజిక్ అనేది కథకి అనుగుణంగానే ఇస్తాను. కథ బాగుంటే, మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఈ సినిమాలో 'నాకు చెప్పకే చెప్పకే..' అనే పాట ఎక్కువగా ఇష్టం. పాటలెప్పుడూ కూడా సినిమాకి తగ్గట్టే ఉండాలి' అని చెప్పారు.