Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ ప్రభుత్వానికీ సరిగ్గా పట్టని ఓ ప్రధాన రంగం వ్యవసాయం. అత్యంత బాధిత వర్గం రైతాంగం. కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణల వల్ల రైతాంగం మరింత దోపిడీకి గురి అవుతారు.
గత ఏడాదికి పైగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రాణాలు హరించే తీవ్రమైన చలికి, వడగాడ్పులకు, వానకు తట్టుకొని పోరాటం చేస్తున్నారు రైతన్నలు. లాఠీ దెబ్బలు, తుపాకీ గుండ్లకు ఎదురీదుతున్నారు. ప్రస్తుత సినీ గంజాయి వనంలో ఓ తులసి మొక్కగా ఉన్న పేదల పక్షపాతి ఆర్.నారాయణ మూర్తి ఈ విషయాన్ని 'రైతన్న' చిత్రంలో తెరకెక్కించే సాహసం చేయటం అభినందనీయం.
మనందరి ప్రోత్సాహానికి అర్హనీయం.
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట అమ్మటం.. ఇదీ వ్యవసాయం అంటే. మొత్తం ప్రక్రియలో వ్యాపారి, ప్రభుత్వం, అధికారి, బ్యాంకు, దళారి, మన కళ్ళకు కనపడని తెర వెనుక కార్పొరేట్ శక్తులు, అన్నింటా రైతన్నకు ద్రోహమే. ఇంత విశాలమైన విషయాన్ని రెండున్నర గంటల సినిమాలో ఆవిష్కరించడం సాహసమే. ఈ సినిమాలో రైతులకు చెందిన అనేక అంశాల్ని తడిమాడు నారాయణమూర్తి. ఒక ధనిక రైతు కుటుంబం, కొంత మంది కౌలు రైతుల సమస్యల చుట్టూ కధ అల్లాడు. పాటలు బాగున్నాయి. చివరలో తప్ప నారాయణ మూర్తి నటన బాగుంది. ఇతర నటీనటులు కూడా బాగానే చేశారు. ఢిల్లిలో జరుగుతున్న రైతాంగ పోరాట సన్నివేశాలు యధాతథంగా చూపటం బాగుంది. అందరూ ఒక్కసారి కనీసం చూడవలసిన సినిమా. ముఖ్యంగా వ్యవసాయం గురించి, అందులోని కష్టాల గురించి, రైతు శ్రమ గురించి తెలియని నేటి పట్టణ యువతరం ఖచ్చితంగా చూడాలి. ఖమ్మంలో రైతుల చేతులకు సంకెళ్లు వేసిన సంఘటనను కూడా చూపారు. విత్తనం, ప్రైవేటు దోపిడీ, రైతు ఆత్మహత్యలు, ఎక్స్‌గ్రేషియా అవహేళన, గిట్టుబాటు ధర, మార్కెట్ మాయ, ప్రభుత్వ విధానాలు, కార్పొరేట్ సేద్యం, కాంట్రాక్టు సేద్యం, రుణాలు, ప్రభుత్వ విధానాలు.. ఇలా అనేక అంశాల ప్రస్తావన ఉంది. సినిమాలో అంతకంటే సాధ్యం కాదు కూడా.
ఈ సినిమా ఒక సాహసం. మంచి విషయం పై మంచి సినిమా. అయితే సినిమాలో కొన్ని నిరాశపర్చే అంశాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మంచిదే అని చూపారు. హేతువాది అని ముద్రపడిన నారాయణ మూర్తి కనీసం 3 సార్లు 'దేవుడి దయవల్ల' అనే మాట ఉచ్ఛరించారు. చనిపోయిన మనిషి తులసి నీళ్లు తాగి బతకటం అశాస్త్రీయమైనది. చివర్లో కొడుకును, బావమరిదిని, పోలీస్ ఆఫీసర్‌ను, పోలీసు తుపాకీతో, నారాయణమూర్తి చంపేయడం అత్యంత అసహజమైన విషయం. ముగింపులో ప్రజల పాత్ర చూపితే బాగుండేది. కానీ వ్యక్తిగత హింసావాదం, హీరోయిజం చూపించారు. రీ రికార్డింగ్ బాగా లేదు. డిజిటల్ మిక్సింగ్ చేస్తే బాగుండేది. స్రీన్క్ ప్లే ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది. ఏమైనా ఆర్.నారాయణమూర్తిని ప్రోత్సహించటానికైనా ఒక్కసారి సినిమాకు వెళ్ళాలి. సామాజిక బాధ్యతతో నిర్మించిన ఈ సినిమా పై ఒక్క రివ్యూ కూడా రాకపోవడం బాధాకరం.
- రమేష్ కుమార్ మక్కడ్, టి.రమేష్