Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్యాంగ్‌స్టర్ నయీం జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'నయీం డైరీస్'. గ్యాంగ్‌స్టర్ నయీంగా వశిష్ట సింహా నటించిన ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకుడు. శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజెస్ పతాకంపై సి.ఎ.వరదరాజు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు దాము బాలాజీ మాట్లాడుతూ, 'గ్యాంగ్‌స్టర్ నయీం అనగానే సెటిల్మెంట్లు, దోపిడీలు, మర్డర్లు చేసే ఓ క్రూర వ్యక్తి అని భావించేలా మీడియాలో పలు కథనాలు వచ్చాయి. వీటిల్లో 90 శాతం అబద్ధాలే. నయీం జీవితంలోని ప్రతి మలుపుని, ఆయన చిన్నప్పటి స్నేహితులు, సన్నిహితుల్ని, రాజకీయ నాయకుల్ని, పోలీసు అధికారుల్ని, ఆయన బాధితుల్ని ఇలా.. ఆయన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ కలుసుకుని, రీసెర్చ్ చేసిన వాస్తవ అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించాం. ఒక్కమాటలో చెప్పాలంటే అందరికీ తెలియని నయీంని ఈ సినిమాలో చూడబోతున్నారు. గ్యాంగ్‌స్టర్‌గా మారకముందు అసలు నయీం ఏం చేసేవాడు?, ఏ విషయాల వల్ల అతని జీవితం మలుపు తిరిగింది?, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి?.. ఇలా ఎన్నో తెలియని ఆసక్తికర విషయాలతో పాటు పోలీసులు, రాజకీయ నాయకులు ఆయన్ని ఎలా వాడుకున్నారు?, ఎందుకు ఎన్కౌంటర్ చేశారు?, ఈ ఎన్‌కౌంటర్‌కి సూత్రధారి ఎవరు?.. వంటి తదితర అంశాల సమాహారంగా ఈ సినిమా ఆద్యంతం థ్రిల్ చేస్తుంది. వెండితెర నయీంగా కన్నడ నటుడు వశిష్ట సింహా నూటికి నూరుశాతం న్యాయం చేశారు. ఇందులో నయీంకి అక్కగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫేమ్ యజ్ఞాశెట్టి నటించారు. ఈ సినిమా కథని రామ్‌గోపాల్‌వర్మగారి కోసం రాశాను. ఐదేళ్ళ క్రితం 'నయీం' పేరుతో ఓ సినిమాని ఎనౌన్స్ చేశాం. కొన్ని ప్రాజెక్టులతో ఆర్జీవీ బిజీగా ఉండటంతో వరదరాజుగారు ఈ సినిమాని నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఆర్జీవీ ప్రోత్సాహంతో, నిర్మాత రాజీపడని తనంతో సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాగా చూస్తే ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఎగ్జైట్్మెంట్తో, ఎమోషనల్ కంటెంట్‌తో, రేసీ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.
వశిష్ట సింహ, యజ్ఞాశెట్టి, డి.ఎస్.రావు, దివివద్యా, సంయుక్తా హార్నాడ్, శశి, దేవి ప్రసాద్, పి.శ్రీనివాసులు, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సురేష్ భార్గవ్, మ్యూజిక్ : అరుణ్ ప్రభాకర్, ఆర్ట్ : తాళ్లూరి మోహన్, యాక్షన్ : నందు, దాము బాలాజీ, ఎడిటర్ : కిషోర్ మాదాలి.