Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ ఎన్నికల్ని మించి వాడీవేడి వాతావరణంలో, పోటాపోటీగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరిగాయి. ఆదివారం ఫిల్మ్‌నగర్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కేంద్రంగా 'మా' ఎన్నికలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ ఎన్నికల్లో 'మా' అధ్యక్ష పదవి రేస్‌లో మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్ బరిలోకి దిగిన విషయం విదితమే.
ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరగటం విశేషం. 883 ఓట్లకిగాను, 605 ఓట్లు డైరెక్ట్‌గా పోల్ అవ్వగా, పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 665 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా, రికార్డు స్థాయిలో 72 శాతం ఓట్లు పోలవడం రికార్డ్‌గా నిలిచింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రామ్‌చరణ్, పవన్‌కళ్యాన్ వంటి హేమాహేమీలు సైతం ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ,' నా అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశా. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడిగా ఎన్నికలు జరగుతాయని అనుకోవడం లేదు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా నా వంతు ప్రయత్నాలు చేస్తాను. 'మా' ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వాళ్ల వ్యక్తిగత విషయం. అది వాళ్ల విజ్ఞతకు వదిలేస్తున్నా. అయితే కొంతమంది చిత్రీకరణల్లో బిజీగా ఉండటం వల్ల ఓటు వేయలేకపోవచ్చు' అని చెప్పారు.
'రెండు ప్యానెళ్ల ఉత్సాహం చూస్తుంటే ఇండిస్టీకి మంచి చేసేటట్లు కనిపించారు. ఇరు ప్యానెల్స్‌లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశా. ఏదేమైనా అధ్యక్షులుగా నిలబడిన ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ఇద్దరూ ఇండిస్టీకి అన్నదమ్ముల్లాంటి వారే. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు.. చేసేవాళ్లే. ఎవరు గెలిచినా వారి వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం' అని బాలకృష్ణ అన్నారు. పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ,'అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు మంచి స్నేహితులు. రాజకీయాలపై 'మా' ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపవు. 'మా' ఎన్నికల్లో ఇంత హడావుడి అవసరం లేదు. అంతేకాదు ఈ ఎన్నికల వల్ల ఇండిస్టీ చీలిపోవడమనేది జరగదు' అని తెలిపారు.
'ఈ గొడవలన్నీ ఎందుకు జరుగుతున్నాయో నాకర్థం కావటం లేదు. ఫలితం ఏం వస్తుందో చూద్దాం. గెలుస్తామన్న నమ్మకం ఉంది. సినిమా తీసినప్పుడు 'ఈ సినిమా హిట్ అవుతుంది' అని ఏవిధంగా ఆశిస్తామో ఇది కూడా అంతే. 'మా' సభ్యులే నా బలం. ఇప్పుడున్న గొడవలు చూస్తుంటే రామ, రావణ యుద్ధంలా ఉంది. ఇదంతా అవసరమా? అనిపిస్తోంది' అని మోహన్‌బాబు అన్నారు.
'మా' ఎన్నికల సందర్భంగా గత కొద్ది రోజులుగా విష్ణు వర్గం, ప్రకాశ్ రాజ్ విమర్శలు, ప్రతి విమర్శలతో యుద్ధం చేశారు. కానీ, తీరా ఎన్నికల ఓటింగ్ వద్దకొచ్చే సరికి... సీన్ మారిపోయింది. అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన విష్ణు, ప్రకాశ్‌రాజ్ దిగిన సెల్ఫీ ఫొటో సొషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, మరికొంత మంది అసహనం వ్యక్తం చేస్తూ నెగటివ్ కామెంట్ల వర్షం కురిపించారు. ఇక విష్ణు సోదరుడు మంచు మనోజ్, ''వాటమ్మా, వాటీజ్ దిస్ అమ్మా?!' అని సరదాగా వ్యాఖ్యానిస్తూ పోస్ట్ పెట్టారు.
ఉద్రిక్త వాతావరణం
'మా' సభ్యులను ప్రలోభ పెట్టేలా పోలింగ్ కేంద్రం లోపల కూడా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రకాశ్‌రాజ్-మంచు విష్ణు ప్యానల్స్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గేటు బయట మాత్రమే ప్రచారం చేసుకోవాలంటూ ఇరు ప్యానల్స్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు కలుగచేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. అయితే ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న నటి హేమ, విష్ణు ప్యానల్ నుంచి కోశాధికారిగా పోటీ చేస్తున్న శివబాలాజీ మధ్య గొడవ తలెత్తి శివబాలాజీ చేతిని హేమ కొరకటంతో చిన్న గాయమైంది.