Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ ఎన్నికల్ని మించి వాడీవేడి వాతావరణంలో, హోరా హోరీగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు విజయకేతనం ఎగురవేశారు. దాదాపు 100 ఓట్ల తేడాతో ప్రత్యర్థి ప్రకాష్‌రాజ్‌పై భారీ విజయాన్ని సాధించి 'మా' అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో తమ అభిమాన కథానాయకుడు మంచు విష్ణు కనీవినీ ఎరుగని రీతిలో 'మా' ఎన్నికల్లో విక్టరీ సాధించడం పట్ల అభిమానులు పోలింగ్ కేంద్రం వద్ద బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
నువ్వా-నేనా అన్నట్టుగా సాగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి రేసులో ఉన్న మంచు విష్ణుకి 381 ఓట్లు రాగా, ప్రకాష్‌రాజ్‌కి 270 ఓట్లు వచ్చాయి. జనరల్ సెక్రటరీగా విష్ణు ప్యానెల్‌కి చెందిన రఘుబాబు (340 ఓట్లు) ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌కి చెందిన జీవిత(313 ఓట్లు)పై గెలిచారు. ట్రెజరర్‌గా శివ బాలాజీ (విష్ణు ప్యానెల్), వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి (విష్ణు ప్యానెల్) విజయం దక్కించు కున్నారు. ఇదిలా ఉంటే, ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌కి సంబంధించి 11 మంది సభ్యులు గెలుపొందగా, మంచు విష్ణు ప్యానెల్‌కి సంబంధించి 7గురు విజయం సాధించారు.
ఆదివారం ఫిల్మ్‌నగర్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కేంద్రంగా 'మా' ఎన్నికలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ ఎన్నికల్లో 'మా' అధ్యక్ష పదవి రేస్‌లో మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్ బరిలోకి దిగిన విషయం విదితమే. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగింది.
గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరగటం విశేషం. 883 ఓట్లకిగాను, 605 ఓట్లు డైరెక్ట్‌గా పోల్ అవ్వగా, పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 665 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా, రికార్డు స్థాయిలో 72 శాతం ఓట్లు పోలవడం రికార్డ్‌గా నిలిచింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రామ్‌చరణ్, పవన్‌కళ్యాన్ తదితరులు ఓటు వేశారు.
ఓటు వేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ,' పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడిగా ఎన్నికలు జరగు తాయని అనుకోవడం లేదు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా నా వంతు ప్రయత్నాలు చేస్తాను. 'మా' ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వాళ్ల వ్యక్తిగత విషయం. అది వాళ్ల విజ్ఞతకు వదిలేస్తున్నా' అని చెప్పారు. 'రెండు ప్యానెళ్ల ఉత్సాహం చూస్తుంటే ఇండిస్టీకి మంచి చేసేటట్లు కనిపించారు. ఇరు ప్యానెల్స్‌లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశా. ఏదేమైనా అధ్యక్షులుగా నిలబడిన ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ఇద్దరూ ఇండిస్టీకి అన్నదమ్ముల్లాంటి వారే. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు.. చేసేవాళ్లే. ఎవరు గెలిచినా వారి వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం' అని బాలకృష్ణ అన్నారు. పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ,'అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు మంచి స్నేహితులు. రాజకీయాలపై 'మా' ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపవు' అని తెలిపారు.
అందరి విజయం
ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌పై నా తనయుడు మంచు విష్ణు భారీ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం అందరిది. నా కొడుకు విజయానికి సపోర్ట్ చేసిన కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. ఇలా అందరికీ ధన్యవాదాలు. 'మా' చరిత్రలో ఇదొక అద్భుతమైన విక్టరీ.
- మోహన్‌బాబు