Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'మహా సముద్రం'. అజరు భూపతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు.
దసరా కానుకగా ఈనెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం కథానాయిక అదితిరావు హైదరి మీడియాతో ముచ్చటించింది.
ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
- నిజాన్ని చెప్పే గుణం, పారదర్శకంగా ప్రవర్తించే నైజం ఉన్న 'మహా' అనే అమ్మాయి పాత్రలో నటించా. తన కుటుంబాన్ని పోషిస్తూ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునే 'మహా' పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది.
- 'మహా' పాత్రకు ప్రాణం పోసేందుకు ప్రయత్నించా. 'మహా'ను ప్రేక్షకులు ఇంటికి తీసుకెళ్లేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తారు (నవ్వుతూ).
- 'మహా' అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఇది స్క్రిప్ట్ బేస్డ్ కథ. ఈ సినిమాకి కథే హీరో. స్నేహం గురించి కూడా ఉంటుంది. ఇందులోని ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. విజరు, అర్జున్‌గా శర్వా, సిద్ధార్థ్ అద్భుతంగా నటించారు.
- 'మహా' పాత్రకు డబ్బింగ్ చెప్పాలని అనుకున్నాను. కానీ 'మహా' వైజాగ్ అమ్మాయి. హైద్రాబాద్ అమ్మాయి కాదు. స్క్రిప్ట్ ప్రకారం వైజాగ్ అమ్మాయిలానే డబ్బింగ్ చెప్పాలి. అలా చెప్పలేను.. నేను సంతప్తి చెందలేనని దర్శకుడికి చెప్పాను. దీంతో వేరే వారితో డబ్బింగ్ చెప్పించారు.
- దర్శకుడు అజరు భూపతి 'ఆర్ఎక్స్ 100' సినిమాను చూశా. ఎమోషన్స్ మీద ఆయనకున్న కమాండ్ నాకు నచ్చింది. నాకు ప్రేమ కథలంటే చాలా ఇష్టం. సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఎదురు చూస్తున్న టైమ్‌లో అజరు ప్రేమ కథగా దీన్ని చెప్పారు. కొలవలేనంత ప్రేమ అనేది కూడా నేను నమ్ముతాను. ప్రతీ బంధంలోనూ ప్రేమ ఉంటుంది.
- 'పొన్నియన్ సెల్వన్' భారీ చిత్రం. మణిరత్నం గారు నా గురువు. ఆయన ఓ పాత్ర సెలెక్ట్ చేసుకున్నారంటే అది కచ్చితంగా బాగుంటుంది. దుల్కర్ సల్మాన్-బందా మాస్టర్ గారితో ఓ సినిమా చేస్తున్నాను. హిందీలో, మలయాళంలోనూ రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.
- నాకు సంగీతం, డాన్స్ అంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యాల్లో రాణించిన ఎం.ఎస్.సుబ్బలక్ష్మి, రేఖ వంటి వారి బయోపిక్స్‌లో నటించాలని ఉంది.