Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి కుమార్, సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, విజరు చందర్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'నాతో నేను'. శాంతి కుమార్ తుర్లపాటి దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్నారు. ఎల్లాలు బాబు టంగుటూరి సమర్పణలో శ్రీ భవ్ నీష్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ నివ్వగా, హీరో ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు శాంతికుమార్ తుర్లపాటి మాట్లాడుతూ, 'పూజా కార్యక్రమంలో స్క్రిప్ట్‌ను పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్‌గారి చేతుల మీదుగా అందుకోవడం ఓ మంచి ఎచీవ్‌మెంట్‌గా ఫీల్ అవుతున్నాను. పాండమిక్ టైంలో ఒంటరిగా ఫీలైనటువంటి పరిస్థితిని కథగా రాశా. అందర్నీ అలరిస్తుంది' అని తెలిపారు.
చిత్ర సమర్పకుడు ఎల్లాలు బాబు టంగుటూరి మాట్లాడుతూ, 'ఈ సినిమా ద్వారా మా కొడుకు ప్రశాంత్‌ని మంచి నిర్మాతగా నిలబెట్టాలని కోరు కుంటున్నాను. సాయికుమార్ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు' అని అన్నారు. 'మంచి కథతో తీస్తున్న మా చిత్రానికి మురళి మోహన్ డిఓపిగా, సత్య కశ్యప్ మ్యూజిక్.. ఇలా అద్భుతమైన సాంకేతిక నిపుణులతో, మంచి నటీనటులు పని చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది' అని నిర్మాత ప్రశాంత్ టంగుటూరి చెప్పారు. సాయికుమార్ మాట్లాడుతూ, 'ఇది నేషనల్ అవార్డు సొంతం చేసుకునే కెపాసిటీ ఉన్న మంచి స్క్రిప్ట్. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి' అని అన్నారు.