Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా జీవితంలో, నా చుట్టూ జరిగిన సంఘటనల నుంచే కథలను తయారు చేస్తాను. ఆ కథల్నే సినిమాలుగా తెరకెక్కిస్తాను. అలా వచ్చిందే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా కూడా' అని అంటున్నారు దర్శకుడు 'బొమ్మ రిల్లు' భాస్కర్. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. జీఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు 'బొమ్మరిల్లు' భాస్కర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, 'పెళ్లి విషయంలో నేను గ్రహించిన పలు అంశాలు, ఆలోచనల సమాహారమే ఈ సినిమా. అన్నింటకంటే ముఖ్యంగా మూడు, నాలుగు రోజుల పాటు 'పెళ్ళి'ని ఓ సెలబ్రేషన్‌లా చేస్తాం. ఆ తర్వాత జీవితం అలాంటి సెలబ్రేషన్ వాతావరణంలోనే సాగుతుందా? లేదా అనే అంశాన్ని లైటర్ వేలో వినోదాత్మకంగా చూపించా. అఖిల్, పూజా పాత్రల్ని, వారి వైఖరిని నిత్య జీవితంలోనూ మనం ఎన్నోసార్లు చూశాం. చూస్తున్నాం కూడా. కలిసి ఉండటానికి, పెళ్ళికి ఉన్న తేడా ఏంటి? అనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశా. దీనికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే పెళ్ళి చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సంద్భరంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది. కథలో భాగంగా మంచి మ్యూజిక్ ఉండాలని ప్రయత్నిస్తా. ఈ సినిమాకి కూడా మంచి మ్యూజిక్ కుదిరింది. ఓ మంచి చిత్రాన్ని చేసే అవకాశాన్ని ఇచ్చిన అరవింద్‌గారికి, బన్నీవాసు, వాసు వర్మకి థ్యాంక్స్.