Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ ప్రియ ప్రొడక్షన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా 'నేనంటే నాకిష్టం' చిత్రం రూపొందనుంది. బి.ఎల్. ప్రసాద్ దర్శకత్వంలో భొక్కిశం భూలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోయే ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దేవుడి పటాలపై బేబీ శివ ప్రియ క్లాప్ నివ్వగా, నిర్మాత భొక్కిశం భూలక్ష్మి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు బి.ఎల్.ప్రసాద్ ఫస్ట్ షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. పారిశ్రామికవేత్త మాసాబత్తిని శివ దర్శక, నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత భొక్కిశం భూలక్ష్మి మాట్లాడుతూ, 'గతంలో ఇదే దర్శకుడితో నిర్మించిన 'ఇది నాది' చిత్రం రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణ టైంలో దర్శకుడు చెప్పిన మరో కథ నచ్చడంతో 'నేనంటే నాకిష్టం' చిత్రాన్ని స్టార్ట్ చేశాం. మా బ్యానర్లో మేం నిర్మిస్తున్న రెండో చిత్రమిది' అని తెలిపారు. 'నా మీద నమ్మకంతో ఒక సినిమా రిలీజ్ కాకముందే, మరో చిత్రానికి అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. ఈ చిత్రంలో ఐదు పాటలు, రెండు ఫైట్లు ఉన్నాయి' అని దర్శకుడు బి.ఎల్.ప్రసాద్ చెప్పారు.