Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యారాజు నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రం 'నాట్యం'. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత, హీరోయిన్ సంధ్యారాజు బుధవారం మీడియాతో ముచ్చటించారు.
ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
నాట్య ప్రధానంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కె. విశ్వనాథ్ వంటి వారు గొప్ప చిత్రాలు చేశారు. నాట్యం అంటే కాళ్లు, చేతులు కదపడం కాదు. దాని ద్వారా ఓ కథను అందంగా చెప్పడం అనే మా దర్శకుడి ఆలోచన ఈ సినిమాలో కనిపిస్తుంది. 'నాట్యం' ద్వారా జనాల్లో ఆలోచనలు రేకెత్తించొచ్చు అనేది మా భావన.
ఈ చిత్రంలో రెండు, మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి. గురు శిష్యుల సంబంధాన్ని, క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను, వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్‌కు మధ్య ఉన్న తేడా ఏంటి? అనేది కూడా ఇందులో చూపించబోతున్నాం. ఇందులో 'నాట్యం' అనేది ఊరి పేరు. ఆ ఊరిలో ఉండే మూఢ నమ్మకాలు కూడా సినిమాలో ఉంటాయి.
మనం ఓ యూనిక్ పాయింట్‌తో సినిమా తీస్తే అందరూ ప్రశంసిస్తారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు మా సినిమా చూసి, అభినందించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఐదారు నిమిషాలే సినిమా చూస్తానని అన్నారు. కానీ సినిమా మొదలైన తరువాత, పూర్తయ్యేంత వరకు చూస్తూనే ఉండిపోయారు. మంచి సినిమా తీశావ్ అంటూ ఆయన నన్ను సత్కరించారు.
చిరంజీవి గారు ఇంకా మా సినిమా చూడలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి కాకుండా, వ్యాపార రంగం నుంచి నేను రావడం, సినిమా తీయడం, నటించడం ఆయనకు బాగా నచ్చింది. మా టీజర్ ఆయనకి బాగా నచ్చటంతో, మమ్మల్ని ప్రశంసించారు. అలాగే రామ్‌చరణ్ మాకు అండగా నిలబడ్డారు.
క్లాసికల్ డ్యాన్స్‌తో టచ్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా ఈ సినిమాని డిజైన్ చేశాం. దాని కోసం మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. స్టోరీకి తగ్గట్టుగా కొరియోగ్రఫినీ చేశాం.
నిర్మాతగా, నటిగా వ్యవహరించడం అంత సులభం కాదు. ఈ తరహా సినిమాని పూర్తి చేసి, థియేటర్ వరకు పట్టుకురావడం చాలా కష్టంగా అనిపించింది.
వ్యాపారాలు చూసుకో అని ఇంట్లో వాళ్లు చెప్పారు. కానీ నా మనసంతా నాట్యం మీదే ఉండిపోయింది. అందుకే నా జీవితాన్ని నాట్యానికే అంకితం చేశాను. నన్ను అర్థం చేసుకుని నా కుటుంబ సభ్యులతోపాటు మెట్టింటి వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు.
మలయాళంలో 'యూటర్న్' సినిమా చేశాను. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. వేరే సినిమాల్లో అవకాశం వచ్చినా చేస్తాను. అయితే మంచి కథ, పాత్ర వస్తేనే నటిస్తాను. జాతీయ అవార్డు సాధించే సత్తా ఉన్న పాత్రలు చేయాలని ఉంది.