Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సినీ పరిశ్రమకు అండగా, కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడిన విషయం విదితమే. 30 మంది సభ్యులున్న టిఎఫ్‌సిసి పాలక కమిటీ గడువు ముగియనుండటంతో నవంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డా.లయన్ ప్రతాని రామకష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్‌ని స్థాపించి ఏండేండ్లు పూర్తయింది. 8 వేల మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 మంది 'టీ మా' ఆర్టిస్టులు సభ్యులుగా చేరడంతో అప్పుడు అవహేళన చేసిన వారే, ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. లాక్ డౌన్ టైమ్‌లో కార్డు ఉన్నా లేకపోయినా 20 వేల కార్మికులకు నిత్యావసర సరుకులు, పలువురు ఆర్టిస్టులకు 5 లక్షల రూపాయల హెల్త్ కార్డులు, వారి పిల్లలకి స్కాలర్ షిప్‌లు, ప్రమాదవశాత్తు మరణించిన వారికి రెండు లక్షల భీమా, అలాగే కార్మికుల సొంతింటి కల సాకారం కోసం రెండున్నర లక్షలు అందించాం. ఇటీవల ముఖ్యమంత్రి గారిని కలిసి ఇళ్ల స్థలాల కోసం విజ్ఞప్తి చేశాం. త్వరలో 10 ఎకరాల భూమిని కేటాయిస్తామని ఆయన మాట ఇచ్చారు. డాన్స్ మాస్టర్స్, మేకప్, ఫైట్ మాస్టర్స్ యూనియన్ల నుంచి మా టిఎఫ్‌సిసి సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారితో మాట్లాడాం. వాళ్ళు సానుకూలంగా స్పందించనప్పటికీ ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పాం. నవంబర్ 14న జరిగే ఎన్నికల్లో ఎవరైనా నామినేషన్ వేయవచ్చు. టియఫ్‌సిసి ఎన్నికలతో పాటు 'తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' ఎన్నికలు కూడా అదే రోజు జరగనున్నాయి' అని చెప్పారు. ఈ సమావేశంలో ఎ. గురురాజ్, కాచెం సూర్యనారాయణ, 'టీమా' జనరల్ సెక్రటరీ స్నిగ్ధ, అడ్వకేట్, ఎలక్షన్ అధికారి కేవియల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.