Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన 'భజరంగి' చిత్రం 212 థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. 2013లో కన్నడనాట రిలీజైన చిత్రాల్లో అత్యధిక వసూళ్ళని కలెక్ట్ చేసిన చిత్రమిది. ఈ చిత్రానికి కొనసాగింపుగా కన్నడలో 'భజరంగి 2' తెరకెక్కింది.
దీన్ని 'జై భజరంగి'గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా 'జై భజరంగి' తెలుగు వెర్షన్ నిర్మాత నిరంజన్ పన్సారి మాట్లాడుతూ, 'గత 30 ఏళ్లుగా వీడియో రంగంలో ఉన్న మా శ్రీ బాలాజీ వీడియో సంస్థ 'జై భజరంగి' వంటి హై క్వాలిటీ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్‌లోనూ ఈ సినిమా ఓటీటీలో విడుదల కాదు. కేవలం థియేటర్లలో మాత్రమే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే విజువల్ వండర్‌గా రూపుదిద్దుకున్న ఇటువంటి చిత్రాన్ని కేవలం థియేటర్లలో మాత్రమే చూడాలి. ఇంట్లో చిన్ని తెర పై చూస్తే ఆ అనుభూతి పొందలేరు. ఈనెల 29న తెలుగు, కన్నడలో ఒకేసారి విడుదల చేస్తున్నాం' అని చెప్పారు. ''బాహుబలి', 'కెజిఎఫ్' రేంజ్లో మన సౌత్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిది. 'చంద్రముఖి', 'అరుంధతి' వంటి చిత్రాల్లో ఉండే థ్రిల్లింగ్ ఈ సినిమాలోనూ ఉంది' అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ అన్నారు. జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత, పంపిణీదారుడు కరుణాకర్‌రెడ్డి, మరో పంపిణీదారుడు రాము, మార్కెటింగ్ ప్రొడ్యూసర్ బాలు తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. శివరాజ్ కుమార్, భావన మీనన్, శతి, సౌరవ్ లోకేష్ తదితరులు ప్రధాన తారాగణం.