Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, రీతూవర్మ జంటగా తెరకెక్కిన చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్న చిత్రమిది.
పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 29న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
తేజ, శేఖర్ కమ్ముల, కష్ణవంశీ, ఆర్కా మీడియా, ప్రకాష్ కోవెలమూడి దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. 'వాంటెడ్' తర్వాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇండిస్టీలో 15 ఏళ్ల జర్నీ తర్వాత ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను.
2017లో చినబాబు గారికి ఈ కథ చెప్పాను. ఆయనకి చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి ఆయన బాగా సపోర్ట్ చేశారు. నా దృష్టిలో ఆయనే ఈ సినిమాకు హీరో. ఆయనకి సినిమా అంటే ఎంతో ఫ్యాషన్. చాలా ఎథిక్స్ ఉన్న వ్యక్తి. అందుకే ఇలాంటి సినిమా తీశారు.
ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పేరు భూమి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎదుటివాళ్లని ఎంత రెస్పెక్ట్ చేస్తుందో, వాళ్ల నుంచి కూడా అదే రెస్పెక్ట్ కోరుకుంటుంది. ఒకరిపై ఆధారపడదు. ఎవరినీ ఇబ్బంది పెట్టదు. అందుకే పర్యావరణానికి ఇబ్బంది లేని ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ చేస్తుంటుంది. అలాంటి అమ్మాయి ప్రేమించాలంటే, తన కంటే ఆ అబ్బాయిలోనే ఎక్కువ క్వాలిటీస్ ఉండాలి. ఈ సినిమాలో హీరో పేరు ఆకాష్ . పేరుకు తగ్గట్టే ఆకాశమంత విశాల హదయం ఉన్న వ్యక్తి. తను ఓ ఆర్కిటెక్ట్. తన ప్రొఫెషన్ లాగే లైఫ్‌ను కూడా అందంగా డిజైన్ చేసుకుంటాడు.
ఇప్పుడున్న అమ్మాయిలకి, అబ్బాయిలకూ బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ముఖ్యంగా ఎలా ఉంటే అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చుతారనేది ఈ సినిమా చూసి ఫాలో అవ్వొచ్చు (నవ్వుతూ). ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా మా సినిమా ఉంటుంది. కథ, సంగీతం, డైలాగ్స్ ఇలా అన్నింటి పరంగా హాయిగా చూసి ఆనందించే సినిమా.
ఐడెంటిటీ కోసం మనమంతా చాలా తాపత్రయపడతాం. ఈ ఐడియాతోనే ఆధార్ కార్డ్ నేపథ్యంలో నెక్స్ట్ మూవీకి కథ రాసుకున్నాను.