Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారంగా భావించే 'దాదా సాహెబ్ ఫాల్కే' పురస్కారాన్ని తలైవా రజనీకాంత్ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. 2019 సంవత్సరానికిగాను ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రకటించింది.
గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం, ఆయన్ని ఈ పురస్కారంతో సముచితంగా గౌరవించింది. ఈ సందర్భంగా యావత్ ప్రపంచం గర్వించదగిన నటుడిగా రజనీకాంత్‌ను వెంకయ్య నాయుడు అభివర్ణించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు.
ఇందులో భాగంగా జాతీయ ఉత్తమ నటులుగా ధనుష్ (అసురన్), మనోజ్ బాజ్‌పేరు (భోంస్లే), ఉత్తమ నటిగా కంగనా రనౌత్ (మణికర్ణిక, పంగా), ఉత్తమ దర్శకుడిగా సంజరు పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరైన్) పురస్కారాలను అందుకోగా, జాతీయ ఉత్తమ చిత్రంగా మరక్కర్ (మలయాళం) దక్కించుకుంది. ఇదిలా ఉంటే, ఇదే వేడుకలో మామా అల్లుళ్లు రజనీకాంత్, ధనుష్ అవార్డులు అందుకోవడం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలో ఏకంగా 5 పురస్కారాలను దక్కించుకుని తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంది. మహేష్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడి పల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన 'మహర్షి' చిత్రం జాతీయ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలిచింది. అలాగే ఉత్తమ కొరియోగఫ్రీ, ఉత్తమ నిర్మాణ సంస్థ విభాగాల్లోనూ ఈ సినిమా పురస్కారాలను దక్కించుకుంది.
నాని హీరోగా గౌతం తిన్నసూరి రూపొందించిన చిత్రం 'జెర్సీ'. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డుని కైవసం చేసుకుంది. అలాగే ఉత్తమ ఎడిటర్ (నవీన్నూలి) విభాగంలోనూ ఈ సినిమా అవార్డుని పొందింది.
రజనీ.. దాదా
భారత ప్రభుత్వం నాకిచ్చిన ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును
నన్ను నటుడిగా గుర్తించి, తీర్చిదిద్దిన నా గురువు కె.బాలచందర్‌గారికి, నా పెద్దన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్‌కు, నా స్నేహితుడు రాజ్ బహదూర్‌కు.. నా సినీ కుటుంబానికి చెందిన నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, సహ నటీనటులకు, పంపిణీదారులకు, థియేటర్ల యజమానులకు.. మీడియా మిత్రులకు.. నన్ను ఎంతగానో ఆరాధించే నా అభిమానులకు.. అలాగే నాకు దైవ సమానులైన తమిళ ప్రజలకు అంకితం ఇస్తున్నాను.
- రజనీకాంత్