Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'. 'ఆర్య', 'ఆర్య 2' సినిమాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి 'సామి సామి' అంటూ సాగే మూడో సింగిల్‌కి సంబంధించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. అలాగే ఈ ప్రోమోకి సంబంధించి అల్లుఅర్జున్, రష్మిక మందన్నా కాంబినేషన్‌తో ఉన్న ఓ స్టిల్‌ని కూడా విడుదల చేశారు. ప్రోమోతోపాటు స్టిల్‌కి కూడా సర్వత్రా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. పక్కా మాస్ లుక్‌తో ఉన్న అల్లుఅర్జున్, రష్మిక అందర్నీ విశేషంగా అలరిస్తున్నారు. ఈనెల 28న ఉదయం 11.07 నిమిషాలకు 'సామి సామి..' పూర్తి పాట విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. 'ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్డేట్ సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, 'దాక్కో దాక్కో మేక', రష్మిక మందన 'శ్రీవల్లి..' పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అందుకే మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన విశేషాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది. ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజరు ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్, సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్, లిరిసిస్ట్: చంద్రబోస్.