Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ చంద్ర హీరోగా యదార్ధ సంఘటనల ఆధారంగా, సమకాలీన జీవిత సమస్యల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'మిషన్ 2020'. హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మదు ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శ్రీ మిత్ర, మై విలేజ్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. కరణం బాబ్జి దర్శకుడు. కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కెవిఎస్ఎస్ఎల్ రమేష్‌రాజు నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రసాద్ ల్యాబ్‌లో పలువురు చిత్ర ప్రముఖులకు ప్రత్యేక ప్రివ్యూ షో చూపించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, 'దర్శకుడు కారణం బాబ్జి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు ఇంతకుముందు కూడా తీసాడు. ఇది కూడా నేటి సమాజం ఎదుర్కొంటున్న ఓ పెద్ద సమస్యతో తీశాడు' అని చెప్పారు.
'నిర్మాతలు అభినందనీయ ప్రయత్నం చేసారు. దర్శకుడు కమర్షియల్ హంగులతోనే కాకుండా ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేసాడు. కామన్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా సినిమాని రూపొందించారు' అని మరో దర్శకుడు వీర శంకర్ అన్నారు. దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, 'నిజంగా చాలా గొప్ప ప్రయత్నం చేసారు. నేటి సమాజంలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూని తీసుకుని బాబ్జి గారు చక్కగా తెరకెక్కించారు. అలాగే ఇలాంటి కథను ఎంచుకుని సినిమా తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు వెంకటేష్, రాజుని కూడా అభినందిస్తున్నాను. సమాజానికి పనికి వచ్చే ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా చాలా బాగుంది. తప్పకుండా అందరికి నచ్చుతుంది' అని తెలిపారు. 'ఈ సినిమా యూత్‌కి మత్తెక్కిస్తుంది. కిక్కెక్కిస్తుంది.. కైపెక్కిస్తుంది.. ఫైనల్‌గా ఆలోచింపచేస్తుంది. ఇప్పటి సమాజానికి ఇది చాలా అవసరమైన సినిమా. ఇలాంటి సినిమాని తీసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు' అని దర్శకుడు కరణం బాజ్జీ అన్నారు.