Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెద్దస్టార్ కావడానికి 5 వరుస హిట్లు కావాలి. నాకు ఉన్న పెద్ద హిట్ 'చలో'. ఇంకా నాలుగు హిట్లు కావాలి. అందులో 'వరుడు కావలెను' రెండోది.. ఇది కూడా పెద్ద హిట్. ఒకే రోజు ఎదగటం కంటే ఒక్కో మెట్టు ఎక్కడం మంచిదని నెమ్మదిగా వెళ్తున్నా' అని అంటున్నారు యువ హీరో నాగశౌర్య.
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం 'వరుడు కావలెను'. రీతు వర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
'చలో' సక్సెస్‌తో మొదలు..
2018లో 'చలో' సక్సెస్ పార్టీలో ఎడిటర్ చంటిగారి ద్వారా అక్క లక్ష్మీ సౌజన్య పరిచయమయ్యారు. ఆ టైమ్‌లో ఆమె చెప్పిన కథ ఇది. అప్పుడు మొదలైన ఈ జర్నీ ఇప్పటి వరకూ కొనసాగుతూ వచ్చింది. ఫైనల్‌గా మా అక్క కల నిజమయ్యే రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది.
పెళ్లి పీటల ముందు వరకూ...
ప్రతి ఇంట్లో చూసే కథే ఇది. 30 ఏళ్లు దాటిన అబ్బాయి, అమ్మాయిలను పెళ్లి ఎప్పుడు?, సంబంధాలు చూడాలా? అని అడగటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అబ్బాయి, అమ్మాయి ఎంత వరకూ రెడీగా ఉన్నారు అనేది ఆలోచించరు. ఇలాంటివి మనం చాలా వింటుంటాం. ఈ పాయింట్ జనాలకు బాగా రీచ్ అవుతుందని అంగీకరించా.
పక్కా యంగ్‌స్టర్స్ కథ..
మెచ్యుర్డ్ లవ్‌స్టోరీ. ఇందులో రెండు ప్రేమకథలుంటాయి. పెళ్లి పీటల ముందు వరకూ జరిగే కథ ఇది. ఆడవాళ్ల ఓపిక, ప్రేమను ఒప్పించేంత వరకూ వెయిట్ చేసే ప్రేమ కథ ఇది. వ్యక్తిగతంగా 80 శాతం నాకీ కథ కనెక్ట్ అయింది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌గారు ఓ సీన్ రాశారు. ఆ సీన్లో నేను యాక్ట్ చేశా. డైలాగ్‌లు చెప్పా. ఇందులో 15 నిమిషాల క్లైమాక్స్ ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సన్నివేశాలను అందరూ ఫ్రెష్‌గా ఫీలవుతారు.
బ్లాక్‌బస్టర్ అని అర్థమైంది
ఈ కథ విన్నప్పుడు బావుందనిపించింది. షూట్‌కి వెళ్లాక మనం కరెక్ట్‌గా వెళ్తున్నామా అనిపించింది. ఎడిటింగ్ సూట్లో అనుకున్న దాని కన్నా బాగా వచ్చిందనిపించింది. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక.. బ్లాక్‌బస్టర్ అని అర్థమైంది.
అది నా డ్రీమ్ ప్రాజెక్ట్..
అవసరాల శ్రీనివాస్‌తో చేస్తున్న 'ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి' సినిమా నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమది. అందులో శౌర్యాను ఏడు రకాలుగా చూస్తారు. ఓటీటీకి నేను రెడీగా లేను. నన్ను నేను 70ఎం.ఎంలో చూసుకోవాలనుకుంటున్నా.