Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ తనయుడు, కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (46) ఇకలేరు. శుక్రవారం ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోయిన ఆయన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆస్పత్రికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. పునీత్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
అయితే వైద్యులు ఆయన్ను బతికించేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో తుదిశ్వాస విడిచారు. పునీత్ మరణ వార్తను రెవిన్యూ మంత్రి ఆర్.అశోక్ అధికారికంగా ప్రకటించారు. పునీత్ ఆకస్మిక మృతితో కన్నడ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆకాల మరణవార్త విని అభిమానులే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినీ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి రాజ్‌కుమార్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన బాలనటుడిగానే తానేమిటో నిరూపించుకుని, ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నారు. పలు సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన పునీత్ 2002లో తెరకెక్కిన 'అప్పూ' చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. హీరోగా దాదాపు రెండు దశాబ్దాలుగా పలు భిన్నమైన చిత్రాలు, పాత్రలతో అందరినీ అలరించారు. కన్నడనాట స్టార్ హీరోగా నెంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్న ఆయన్ని అభిమానులు, ప్రేక్షకులు ముద్దుగా 'అప్పూ', 'పవర్‌స్టార్'గా పిలుచుకుంటారు. నటుడిగానే కాకుండా గాయకుడిగా కూడా పునీత్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే నిర్మాతగానూ పలు చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా కూడా పేరొందారు. హీరోగా వెండితెర ప్రేక్షకుల్ని అలరించిన ఆయన 'కన్నడ కోట్యాధిపతి' షోతో బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం మెస్మరైజ్ చేశారు. నటుడిగా, గాయకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యతగా, నిర్మాతగా అన్నింటికిమించి విస్తృతమైన సామాజిక సేవా కార్యక్రమాలతో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా పునీత్ అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. హీరోగా 'అప్పూ', 'వీర కన్నడిగ', 'అజరు', 'అరసు', 'రామ్', 'అంజనీపుత్ర' వంటి తదితర సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విశేషంగా అలరించారు. హీరోగా 29 సినిమాల్లో నటించారు. ఆయన ఆఖరి చిత్రం 'యువరత్న'.
ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యింది. నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్‌లోనూ పునీత్ తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ని క్రియేట్ చేసి, అందర్నీ మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించారు. ఆయన ఎక్కువ శాతం పక్కా మాస్ చిత్రాల్లోనే నటించారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న 'జేమ్స్', 'ద్విత్వా' చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.
చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన సోదరుడు శివరాజ్‌కుమార్ నటించిన 'భజరంగీ 2' పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ పెట్టారు. ఈ సినిమా శుక్రవారం కన్నడ, తెలుగు భాషల్లో విడుదలైంది. పునీత్‌కు భార్య అశ్వనీ రేవంత్, ధ్రితి, వందిత అమ్మాయిలు ఉన్నారు. పునీత్ భౌతికకాయాన్ని అభిమానులు, ప్రజల సందర్శానార్థం కంఠీరవ స్టేడియంకి తరలించనున్నారు. శనివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కంఠీరవ స్టూడియోస్‌లో తండ్రి రాజ్‌కుమార్ సమాధి పక్కనే పునీత్ అంత్యక్రియలు జరుగనున్నాయి. తమ అభిమాన నటుడ్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తుండటంతో కర్నాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అలాగే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లను మూసివేయాలని ఆదేశాలూ జారీ చేసింది. కన్నడీగుల అభిమాన కథానాయకుడు పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మృతి యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు అని పలు చిత్ర సీమలకు చెందిన ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రికి తగ్గ తనయుడు
పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం తనని దిగ్భ్రాంతికి గురిచేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కన్నడిగుల అభిమాన హీరో అప్పూ మరణం కన్నడ చిత్రసీమకు, కర్ణాటకకు తీరని లోటని పేర్కొన్నారు.
తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందిన పునీత్ ఆకాల మృతి పట్ల ప్రధాని మోడీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
హదయం ముక్కలైంది. పునీత్ రాజ్‌కుమార్ ఇంత త్వరగా మనల్ని వదలి వెళ్లారనే వార్త విస్మయానికి గురి చేసింది.
- చిరంజీవి
పునీత్ రాజ్‌కుమార్ చాలా మంచి మనిషి. భగవంతుడు కొన్నిసార్లు ఇలా ఎందుకు చేస్తాడో నాకు అర్థంకాదు. యావత్ సినీ ప్రపంచానికి విషాదకరమైన రోజు ఇది.
- మోహన్ బాబు
అప్పూ మతితో గొప్ప స్నేహితుడ్ని కోల్పోయా. ఆయన మతి కన్నడ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి కథానాయకుడు, గాయకుడు, నిర్మాత, బుల్లితెర వ్యాఖ్యాతగా ప్రతిభ చాటాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
- బాలకృష్ణ
పునీత్ రాజ్‌కుమార్ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి.
-నాగార్జున
పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. నమ్మశక్యం కాలేదు
- పవన్ కల్యాణ్
పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను కలిసిన, మాట్లాడిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు
- మహేశ్‌బాబు
నా ప్రియమైన సోదరుడు పునీత్ రాజ్‌కుమార్ కల్మషం లేని వ్యక్తి. తన తండ్రి నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
- రామ్‌చరణ్
నా హదయం బద్దలైంది. మమ్మల్ని వదిలి మీరు ఇంత త్వరగా వెళ్లిపోయారనే విషయాన్ని నమ్మలేకపోతున్నా.
- ఎన్టీఆర్
నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో పునీత్ రాజ్‌కుమార్ ఒకరు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండేవారు.
- రామ్
పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరన్న వార్త విని షాకయ్యా. యువకుడు, అద్భుతమైన వ్యక్తి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం విచారకరం. ఒకట్రెండు సార్లు మాత్రమే ఆయనను కలిశా. ఆ సమయంలో ఆయన ఇచ్చిన ఆతిథ్యం, చూపిన ప్రేమ, ఆప్యాయత మర్చిపోలేను.
- ఎస్.ఎస్.రాజమౌళి
నేను కలిసిన వ్యక్తుల్లో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఇంత చిన్న వయసులోనే కన్నుమూయటం నన్నే కాదు యావత్ సినీ ప్రపంచాన్నే షాక్‌కి గురి చేసింది. వృత్తిపరంగా మేమిద్దరం కలిసి కొన్ని ప్రాజెక్టులు చేయాలనుకున్నాం. ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల సందర్భంలోనూ పునీత్‌తో కొన్ని విషయాలు చర్చించాను. సోదర సమానుడి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. 'మా' కుటుంబం నుంచి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నా.
- 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు